బండ ప్రకాశ్ రాజీనామాకు ఆమోదం

by Shyam |   ( Updated:2021-12-04 07:56:39.0  )
బండ ప్రకాశ్ రాజీనామాకు ఆమోదం
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాశ్ ముదిరాజ్ ఈ నెల 2వ తేదీన సమర్పించిన రాజీనామాకు శనివారం ఆమోదం లభించింది. డిసెంబరు 4వ తేదీ నుంచి ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉండరని సెక్రటరీ జనరల్ పీసీ మోడీ పేర్కొన్నారు. తెలంగాణ నుంచి ఉన్న మొత్తం ఏడు స్థానాల్లో ఒకరిగా ఉన్న బండ ప్రకాశ్ రాజీనామాతో త్వరలో ఉప ఎన్నిక అనివార్యం కానున్నది. 2018 ఏప్రిల్‌ నెలలో ఆయన రాజ్యసభ సభ్యుడయ్యారు. ఇప్పుడు మధ్యంతరంగా రాజీనామా చేయడంతో 2024 ఏప్రిల్ వరకు కొనసాగేలా ఉప ఎన్నిక జరగనున్నది. తెలంగాణ నుంచి ఒక స్థానం ఖాళీ అయినట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి కూడా రాజ్యసభ సెక్రటరీ జనరల్ సమాచారం అందించారు. ఇక ఉప ఎన్నిక కోసం కసరత్తు మొదలుపెట్టడమే తరువాయి.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బండ ప్రకాశ్ పోటీ చేసి గెలుపొందడంతో ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి మరో సభ్యుడి కోసం టీఆర్ఎస్ అధిష్ఠానం ఇప్పటికే దాదాపు కసరత్తు మొదలుపెట్టింది. నమస్తే తెలంగాణ పత్రిక మేనేజింగ్ డైరెక్టర్ దామోదర్ రావుతో పాటు మాజీ ఎంపీ వినోద్ కుమార్, మోత్కుపల్లి నర్సింహులు.. ఇలా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. అయితే పార్టీ అధినేత కేసీఆర్ ఎవరిని ఎంపిక చేస్తారన్నది కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేసే సమయానికి తేలిపోనున్నది. తొలుత ఈ స్థానానికి కల్వకుంట్ల కవిత వెళ్ళొచ్చన్న ఊహాగానాలు వినిపించినప్పటికీ ఆమె ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో మరో అభ్యర్థిని ఎంపిక చేయడం అనివార్యమైంది.

Advertisement

Next Story