దళితుల ఇంట్లో కేసీఆర్, అంబేద్కర్ ఫోటో మాత్రమే ఉండాలి : బాల్క సుమన్

by Anukaran |   ( Updated:2023-03-30 18:19:58.0  )
దళితుల ఇంట్లో కేసీఆర్, అంబేద్కర్ ఫోటో మాత్రమే ఉండాలి : బాల్క సుమన్
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : హుజురాబాద్ ఉప ఎన్నిక‌లో ద‌ళితుల ఓట్లను చీల్చేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ‌య్‌, ఈట‌ల రాజేంద‌ర్‌ రాజ‌కీయ కుట్రలు చేస్తున్నార‌ని ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ ఆరోపించారు. ఆదివారం క‌మ‌లాపూర్ మండ‌లంలోని గూనిప‌ర్తి, ఉప్పల్ గ్రామాల్లో ద‌ళిత‌బంధు స‌మ్మేళనం స‌ద‌స్సులో ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డితో క‌లిసి ఆయ‌న పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ఉప్పల్ గ్రామంలో నిర్వహించిన సమ్మేళనంలో బాల్క సుమ‌న్ మాట్లాడుతూ.. ద‌ళితుల అభివృద్ధికి కేసీఆర్ కృషి చేస్తున్నార‌ని, అయితే ద‌ళితుల ఓట్లను చీల్చేందుకు బీజేపీ రాజ‌కీయ కుట్ర తెర‌లేపింద‌ని అన్నారు. ఇద్దరు ద‌ళిత‌ నేత‌ల‌ను హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయించేందుకు ప్రయ‌త్నం చేస్తోందంటూ బీజేపీని ఉద్దేశించి అన్నారు. ఇన్నాళ్లు మ‌నల్ని ప‌రాయేళ్లుగా, కిరాయేళ్లుగా చూసిన కొంత‌మంది ఇప్పుడు ఓట్ల కోసం మ‌న‌ద‌గ్గరికి వ‌స్తున్నారు.. వాళ్లను రానియొద్దని పేర్కొన్నారు.

ద‌ళితుల‌కు కేసీఆర్ రూ.ల‌క్షకోట్లు ఇస్తున్నామంటే బీజేపీ నేత‌లు భ‌య‌ప‌డిపోతున్నార‌ని, మ‌రి కేంద్రం నుంచి క‌నీసం రూ.50వేల కోట్లు ఎందుకు తీసుకురావడం లేదంటూ ఎంపీ బండి సంజ‌య్‌ను ఉద్దేశించి అన్నారు. ద‌ళితుల ఇంట్లో రెండే ఫొటోలు ఉండాలె.. ఒక‌టి కేసీఆర్‌ది.. రెండోది అంబేద్కర్‌ది.. ఇంకెవ‌రి ఫోటో అవ‌స‌రం లేదంటూ సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed