- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వెయ్యేళ్ల కిందటే సర్జరీలు.. తెలంగాణ వైద్యుడి ఘనత
దిశ ప్రతినిధి, నల్లగొండ: ఆకు పసరుకట్లు.. మూలికలు, లేహ్యాలు, దుంపలు వైద్యానికి వాడినట్లు అందరికీ తెలుసు. కానీ, వెయ్యేళ్ల క్రితమే శస్త్రచికిత్సలు చేసి ప్రాణాలను కాపాడిన వైద్యమహానీయులు ఉన్నారు. తెలుసా.. ఏంటీ? ఆ కాలంలో సర్జరీలేంటీ? అని సందేహిస్తున్నారా? అవును నిజమే. ఒకటి కాదు రెండు కాదు శతాబ్దాలు కూడా కాదు.. వెయ్యేళ్ల క్రితమే అరుదైన ఆపరేషన్స్‌తో యుద్ధాల్లో గాయపడిన సైనికులను.. రోగాల బారినపడి ప్రజల ప్రాణాలను తిరిగి నిలబెట్టారు. ఇదంతా నమ్మశక్యంగా లేదని భావిస్తున్నారా? ఈ విషయాన్ని భారతీయ వైద్య విజ్ఞాన వారసత్వ కేంద్రం బృందం ధృవీకరించింది. ఆ విశేషాలు మీరే స్వయంగా చదివి తెలుసుకోండి. యాదాద్రిభువనగిరి జిల్లా సైదాపురంలో ఇటీవల కాలంలో బయటపడిన అతిపురాతన శాసనాల ద్వారా ప్రాచీనకాలంలోనే ఆయుర్వేద వైద్య శస్త్రచికిత్సల ప్రస్తావన మనకు స్పష్టమవుతోంది. 11వ శతాబ్దంలో అయుర్వేద వైద్య నిపుణుడు అగ్గలయ్య చేసిన శస్త్రచికిత్స ముచ్చటపై ‘దిశ’ ప్రత్యేక కథనం.
ఎవరీ అగ్గలయ్య?
అగ్గలయ్య.. చాళుక్య ప్రభువు రెండో జయసింహుని ఆస్థాన వైద్యుడు. వైద్య శాస్త్రంలో దిట్ట. ఎవరూ నయం చేయలేని ఎన్నో మొండి రోగాలను నయం చేసిన గొప్ప వైద్యుడిగా చరిత్రకారులు చెబుతున్నారు. శస్త్రచికిత్సలో ప్రసిద్ధుడు. ఈ అగ్గలయ్య.. ‘శాస్త్రాశాస్త్ర కుశల’ ‘వైద్యరత్నాకర’ ‘ప్రాణాచార్య’ ‘నరవైద్య’ బిరుదులతో కీర్తింపబడ్డారని, ఆ కాలంలో వైద్య రంగంలో ప్రముఖ వైద్యుడిగా ప్రసిద్ది పొందారని సైదాపురం శాసనం ద్వారా తెలుస్తోంది. మరుగునపడ్డ ఈ గొప్ప తెలంగాణ వైద్యుడి పేరుతో వరంగల్ మహానగరంలో ఓ గుట్ట ఉండటం గమనార్హం.
ఇప్పుడు అందుబాటులో ఉన్న ఎన్నో ఆపరేషన్స్.. చాళుక్యుల కాలం (11వ శతాబ్దం)లోనే ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణుడు అగ్గలయ్య చేసినట్లు సైదాపురం శాసనం పేర్కొంటోంది. 1034 సంవత్సరాల క్రితమే అగ్గలయ్య ఎంతో మందికి ఆపరేషన్స్ చేసి వ్యాధులను నయం చేశాడని భారతీయ వైద్య విజ్ఞాన వారసత్వ కేంద్ర బృందం ఇటీవల సైదాపురం శాసనాన్ని పరిశీలించి చెప్పింది. యుద్ధాల్లో దంతాలు, కాళ్లుచేతులు కోల్పోయి తీవ్రంగా గాయపడిన సైనికులకు ఒకరకమైన మత్తు మందు ఇచ్చి ఆపరేషన్స్ చేసేవారని శాసనాల ద్వారా తెలుస్తోందని ఆ బృందం తెలిపింది. ఒక్క సైనికులకే కాకుండా రాజ్యంలోని ప్రజలకు అగ్గలయ్య వైద్యం చేయడంతో పాటు విద్యార్థులకు ఆయుర్వేద విద్యను బోధించినట్లు శాసనాన్ని పరిశీలిస్తే తెలుస్తుందని బృందం పేర్కొంది.
శాసనాన్ని గుర్తించిన చరిత్రకారుడు
యాదగిరిగుట్ట మండలంలోని సైదాపూర్ గ్రామంలో ఈ శాసనాన్ని 1979లో ప్రముఖ చరిత్రకారుడు పీవీ పరబ్రహ్మశాస్త్రి గుర్తించారు. శాసనాన్ని గ్రామ పొలాల్లో 20 అడుగుల ఎత్తు ఉన్న ఏకశిలపై లిఖించారు. అగ్గలయ్యకు సముచిత గౌరవం కల్పించేందుకు పశ్చిమ చాళుక్యరాజు జగదేకమల్ల జయసింహుడు (1015-1042) సైదాపూర్ శాసనాన్ని వేయించినట్లు తెలుస్తోంది. ఈ శాసనం మీద తెలుగు, కన్నడ భాషల్లో మూడు వైపులా 81 వరుసల్లో చెక్కించారు. 40 ఏండ్ల క్రితమే శాసనాన్ని గుర్తించినప్పటికీ అది ఎవరి ఆదరణకు నోచుకోలేకపోయింది. తెలంగాణ ప్రాంతంలో శస్త్రచికిత్సల విషయంలో వెలుగువెలిగిన అగ్గలయ్య కీర్తిని చాటే.. శాసనం కాలక్రమేణా మరుగునపడిపోయింది. 2017లో భారతీయ వైద్యవిజ్ఞాన వారసత్వ కేంద్రం ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించగా.. అందులో జయసింహుడి ఆస్థానంలో అగ్రస్థానంలో ఉన్న అగ్గలయ్య పేరును తెలంగాణలోని ఏదైనా ఒక ఆస్పత్రికి పేరు పెట్టాలని చర్చించారు. కానీ, ఆ విషయమై ఇంతవరకు ఎలాంటి ముందడుగు పడలేదు.
ప్రపంచంలోనే అరుదైన శాసనం
ప్రపంచంలోనే ఇది అరుదైన శాసనంగా భావించొచ్చు. ఎందుకంటే.. ఒక వైద్యుడి గురించి ప్రముఖంగా ప్రస్తావిస్తూ బయటపడిన శాసనం ఇదే మొదటిది కావడం విశేషం. అగ్గలయ్య అంతటి మహావైద్యుడు కావడం వల్లే చాళుక్యరాజులు శాసనాల్లో వేయించారనడంలో ఎలాంటి సందేహం లేదు. అగ్గలయ్య ఆధ్వర్యంలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన జైనాలయాలు, వైద్యసేవలు, భూములు నిర్వహించినట్లు బహిర్గతం అవుతుంది. ప్రపంచంలోని వైద్యులు, శస్త్రచికిత్స నిపుణులు, వైద్యవిద్యార్థులకు శస్త్రవైద్యుడు అగ్గలయ్య గురించి తెలిపేందుకు భారతీయ వైద్య విజ్ఞాన వారసత్వ కేంద్రం, జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో డాక్యుమెంటరీని రూపొందిస్తున్నారు.