ఆ మాస్కులు అంత సేఫ్ కాదు.. మరి మీ మాస్క్ ఏంటి?

by vinod kumar |   ( Updated:2021-05-27 05:25:22.0  )
Awareness masks
X

దిశ, కోదాడ: ఒకప్పుడు మాస్కులు ధరించే వారిని వింతగా చూసేవారు. కానీ ఇప్పుడు మాస్కులు లేని వారిని వింతగా చూసే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం అందరి జీవితాల్లో మాస్కు ఒక తప్పనిసరి వస్తువుగా మారిపోయింది. రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసులు భయాందోళనకు గురిచేస్తున్నాయి. జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వాలు చెబుతున్నా.. కొందరి నిర్లక్ష్యం కరోనా వ్యాప్తికి కారణమవుతోంది. ప్రజల నుంచి ప్రభుత్వాలు ముఖ్యంగా రెండు విషయాలు కోరుతోంది. ఒకటి సామాజిక దూరం పాటించడం.. రెండు మాస్కులు ధరించడం. ఇప్పుడు చాలా మంది సామాజిక దూరాన్ని బాగానే పాటిస్తున్నారు. కానీ మాస్కుల విషయంలో ఎంత జాగ్రత్త వహిస్తున్నారు? మీరు ధరిస్తున్న మాస్కులు ఎంత వరకు రక్షణ కలిగిస్తాయి. కరోనా మహమ్మారి పుట్టుకొచ్చిన నాటినుంచి మాస్కు లేకుండా బయటకు వెళ్లలేని పరిస్థితి. సెకండ్‌వేవ్‌ నేపథ్యంలో ఇంట్లోనూ వాడాల్సిన దుస్థితి నెలకొన్నది. మాస్కు పెట్టుకున్నప్పటికీ మహమ్మారి బారినపడుతున్నామని పలువురు ఆందోళన చెందుతున్నారు. మాస్కు ధరించడంపై సరైన అవగాహన లేకనే పలువురు వైరస్‌బారిన పడుతున్నారని, ఒక్కోసారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని ప్రపంచ ఆరోగ్యసంస్థ (WHO) తెలిపింది. వైరస్‌ నుంచి మాస్కు రక్షిస్తుందా? ఎప్పుడు ఏ మాస్కు ధరించాలి? ఎక్కడికి వెళ్లినప్పుడు ధరించాలి? ఎవరు ఏ మాస్కు వాడాలి? అనే సందేహాలను నివృత్తి చేసేందుకు డబ్ల్యూహెచ్‌వో మాస్క్‌లు ధరించడంపై మార్గదర్శకాలను విడుదల చేసింది.

సర్జికల్‌ మాస్కులు- surgical mask

మూడు పొరలతో ఉండే సర్జికల్‌ మాస్కుల ధర తక్కువే. విరివిరిగా మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రతి ఒక్కరూ వీటిని కచ్చితంగా ఉపయోగించాలి. కరోనా సోకిన వ్యక్తుల వద్దకు.. లేదా అనుమానుతుల వద్దకు ఈ మాస్కును ధరించి వెళ్లకూడదు. సామాజిక దూరం పాటించే అన్ని చోట్లా ఈ మాస్కులు ఉపయోగకరంగా ఉంటాయి. వీటిని ఒక్కసారి మాత్రమే ఉపయోగించాలి. హెల్త్‌వర్కర్లు, కొవిడ్‌- 19 వైరస్‌ సోకినవారు, లక్షణాలు ఉన్నవారు, వైరస్‌ వచ్చిందనే అనుమానం ఉన్నవారు, సోషల్‌ డిస్టెన్స్‌ పాటించడం వీలులేని ప్రదేశాలకు వెళ్లేవారు సర్జికల్‌ (మెడికల్‌) మాస్క్‌లు ధరించాలి. 60 ఏండ్లు దాటిన వ్యక్తులు, ఆరోగ్య సమస్యలున్నవారు ఈ మాస్కులను ధరించాలి.

ఫ్యాబ్రిక్‌ మాస్కులు- Fabric mask

ఫ్యాబ్రిక్‌ మాస్క్‌లను ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. గుడ్డతోచేసే ఈ మాస్కులను కొవిడ్‌ లక్షణాలు లేనివారు, సోషల్‌ వర్కర్లకు దగ్గరగా ఉండేవారు. బ్యాంకు క్యాషీయర్లు, ప్రజారవాణా, కిరాణా దుకాణాలు, హోటళ్లలో పనిచేసేవారు, రోజువారీ పనుల కోసం కార్యాలయాలకు వెళ్లేవారు ధరించవచ్చు.

ఎన్‌ 95 మాస్కులు

దేశంలో కరోనా కేసులు నమోదవుతున్న కొత్తలో చాలా మంది విపరీతంగా ఈ ఎన్‌95 మాస్కులను కొని వాడారు. ఇప్పటికీ కొంత మంది వాటిని వాడుతున్నారు. నిజానికి వీటిని సాధారణ వ్యక్తులు వాడాల్సిన అవసరం లేదు. కరోనా సోకిన వ్యక్తులకు చికిత్స అందించే సమయంలో వైద్యులు, వైద్య సిబ్బంది.. కరోనా సోకిన వ్యక్తులను కలిసినప్పుడు, సామాజిక దూరం పాటించలేని సమయంలో సాధారణ వ్యక్తులు వీటిని వాడితేనే ఉపయోగకరం. సర్జికల్‌ మాస్కు కన్నా కాస్త దళసరిగా ఉండే ఈ మాస్కు గాలిని బాగా ఫిల్టర్‌ చేస్తుంది. నోరు, ముక్కును పూర్తిగా కప్పి ఉంచుతుంది. దీంతో ఈ మాస్క్‌ సూక్ష్మక్రిములను 95 శాతం అడ్డుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే దీనికి ఎన్‌ 95 అని పేరొచ్చింది. అయితే ఇది గరిష్టంగా 8 గంటలు బాగా పనిచేస్తుంది. ఆ తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగొచ్చు. వీటిని రెండు మూడు సార్లు మాత్రమే ఉపయోగించగలం. శుభ్రపర్చి మళ్లీ వాడటం అంత శ్రేయస్కరం కాదు.

ఇంట్లో తయారీ చేసిన మాస్కులు.. రుమాలు

సర్జికల్‌ మాస్కులు అందుబాటులో లేకపోతే.. ఇంట్లోనే వస్త్రంతో కుట్టిన మాస్కులు లేదా రుమాలు ధరిస్తున్నారు. ఇది మంచి పరిణామమే. కానీ మాస్కు కోసం ఎంచుకునే ఏ వస్త్రమైనా గాలి సరఫరా సరిగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ పొరలు పెట్టి కుడితే ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలగొచ్చు. కాబట్టి వీలైనంత పలచగా మాస్కు ఉండాలి. నోరు, ముక్కును పూర్తిగా కవర్‌ చేసేలా మాస్కును ధరించాలి. వదులుగా ఉంటే వైరస్‌ సోకే ప్రమాదముంది. వస్త్రమే కాబట్టి ఉతికి మళ్లీ మళ్లీ వినియోగించుకోవచ్చు. సామాజిక దూరం పాటిస్తూ.. జనసాంద్ర తక్కువ ఉండే ప్రాంతాలు, గాలి ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లేటప్పుడు వీటిని ధరించొచ్చు.

ఏ మాస్క్‌ నుంచి ఎంతరక్షణ?

మార్కెట్‌లోకి అనేక రకాల మాస్కులు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో వైరస్‌, బ్యాక్టీరియా, దుమ్ము, కాలుష్యం నుంచి ఏ మాస్క్‌ ఎంతశాతంవరకు అరికడుతుందనే డబ్ల్యూహెచ్‌వో వివరించింది. మాస్కులు, గ్లోవ్స్ ధరించినప్పటికీ చేతులు శుభ్రంగా కడగకపోతే చేతులకు తాకిన వైరస్ మళ్లీ మాస్కును, గ్లోవ్స్‌కు అంటుకునే ప్రమాదం ఉందంటున్నారు. ముఖ్యంగా మాస్కు సురక్షితమైనది అయ్యుండాలి. అంతేకాకుండా మాస్కును ధరించిన అనంతరం పదేపదే దానిని సర్దుకోకుండా చూసుకోవాలి. కానీ చాలామందికి పదేపదే మాస్కును సర్దుకునే అలవాటు ఉంటుంది. అంతేకాకుండా నోరు, ముక్కు, కళ్లు, చెవులను తాకకుండా ఉండాలి. కేవలం మాస్కు, గ్లోవ్స్ ధరించి.. మిగతావన్నీ నిర్లక్ష్యం చేయడం వల్ల వైరస్ ఇంకా వేగంగా వ్యాపించే ప్రమాదముందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.

అయితే మాస్కు ఎందుకు ధరించాలి?

ఒకరి నుంచి మరొకరికి కోవిడ్ -19 వైరస్ సులభంగా వ్యాపిస్తుంది. వైరస్ మోసుకెళ్ళే సూక్ష్మ బిందువులు/చిన్న చుక్కలు వెంటనే తడి ఆరిపోయి పరమాణువుల రూపంలో గాలిలో తేలుతూ వివిధ ఉపరితలాలపై పడుతాయి. కోవిడ్ -19 వ్యాధికి మూలమైన వైరస్ గాలితుంపరలో దాదాపు మూడు గంటల వరకు ఉంటుందని కనుగొన్నారు. ప్లాస్టిక్ మరియు స్టీలు పాత్రలపై దాదాపు మూడు రోజుల వరకు ఉంటుంది. వైరస్ సోకిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా గాలిలో వ్యాపించే తుంపర ద్వారా ఇతరుల శ్వాసకోశంలోకి వ్యాపించే అవకాశాలను మాస్కులు తగ్గిస్తాయి. నిర్ధారిత ఉష్ణోగ్రతలో, అతినీలలోహిత కిరణాలు, నీరు, సబ్బు మరియు ఆల్కొహాల్ వంటి సాధనాలను ఉపయోగించి శుభ్రం చేసిన మాస్కులు ధరించిన వారు వైరస్ ను పీల్చే అవకాశాలు తక్కువ అని నిపుణులు పేర్కొంటున్నారు. ఆ విధంగా మాస్కుల ధారణ వైరస్ వ్యాప్తిని ఆపడంలో కీలకం.

Advertisement

Next Story

Most Viewed