జూన్‌లో 12 కోట్ల డోసుల లభ్యత

by Shamantha N |
జూన్‌లో 12 కోట్ల డోసుల లభ్యత
X

న్యూఢిల్లీ: వచ్చే నెలలో కరోనా టీకాల లభ్యత వివరాలున కేంద్ర ప్రభుత్వం ఆదివారం వెల్లడించింది. జూన్ నెలలో సుమారు 12 కోట్ల డోసులు పంపిణీకి అందుబాటులో ఉన్నాయని వివరించింది. ఇందులో 45ఏళ్లుపైబడినవారికీ, హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్ల కోసం 6.09 కోట్ల (6,09,60,000) డోసులు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేయనున్నట్టు తెలిపింది. వీటికితోడు టీకా తయారీదారుల వద్ద 5.86 కోట్ల(5,86,10,000) డోసులు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. వీటిని రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు హాస్పిటళ్లు నేరుగా కొనుగోలు చేసుకోవచ్చని వివరించింది. అంటే మొత్తం 11,95,70,000(సుమారు 12కోట్లు) డోసులు జూన్ నెలలో పంపిణీ చేయడానికి అందుబాటులో ఉంటాయని తెలిపింది.

కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు హాస్పిటళ్లు టీకా పంపిణీకి సరైన రీతిలో ప్రణాళికలు వేసుకోవాలని సూచించింది. రద్దీ లేకుండా సాఫీగా వ్యాక్సినేషన్ జరగాల్సిన ఉద్దేశంతోనే ముందస్తుగానే టీకా లభ్యత వివరాలు అందిస్తున్నట్టు పేర్కొంది. జూన్‌లో సుమారు 12 కోట్ల డోసులు అందుబాటులో ఉంటుండగా, మే నెలలో 7,94,05,200 (సుమారు 8 కోట్లు) డోసులు అందుబాటులోకి వచ్చాయని వివరించింది. అంటే, జూన్ నెలకు టీకా లభ్యత 50శాతం పెరిగినట్టు తెలుస్తుంది.

Advertisement

Next Story

Most Viewed