‘ఆటోమెటిక్ ’ ఆచరణలో కష్టమే..!

by Shyam |   ( Updated:2020-09-07 03:00:05.0  )
‘ఆటోమెటిక్ ’ ఆచరణలో కష్టమే..!
X

దిశ, న్యూస్ బ్యూరో : ఇలా రిజిస్ట్రేషన్.. అలా మ్యూటేషన్​.. సాధ్యమేనా? తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టంలో ఇదే సరికొత్త సదుపాయం. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల అనుసంధానం చేసి ఎవరికీ ఇబ్బందులు కలగకుండా చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే క్షేత్ర స్థాయిలో ఎంత వరకు సాధ్యమన్న ప్రశ్నకు రెవెన్యూ వర్గాల నుంచి కష్టమేనన్న సమాధానం వస్తోంది. సాంకేతిక నైపుణ్యంతో ఆటోమెటిక్ మ్యూటేషన్​ చేయడానికి రికార్డులన్నీ సక్రమంగా ఉండాలి. ఏ ఒక్క పొరపాటు ఉన్నా అసాధ్యమేనని స్పష్టమవుతోంది. రెవెన్యూ రికార్డుల్లోని విస్తీర్ణానికి, క్షేత్ర స్థాయిలో విస్తీర్ణానికి మధ్య వ్యత్యాసమే దీనికి కారణంగా తేలింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ అనుసంధాన ప్రక్రియ పరిగి రెవెన్యూ డివిజన్‌లో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. గడిచిన రెండేండ్లుగా ఆటోమెటిక్ మ్యూటేషన్​ చేస్తున్నారు. కుల్కచర్ల, పూడూరు, పరిగి, దోమ మండలాల్లో అమలు చేస్తున్నారు.

ఈ రెండేండ్ల కాలంలో అనుసంధాన ప్రక్రియ ద్వారా 70 శాతం మాత్రమే సక్సెస్ పొందినట్లు రెవెన్యూ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నాలుగు మండలాల్లో 4 వేల డాక్యమెంట్లు జరిగాయి. అయితే వెయ్యి డాక్యుమెంట్లు మ్యుటేషన్లకు నోచుకోలేదు. ఇప్పటికీ భూ పరిపాలన అధికారి కార్యాలయంలో అనేక ఫైళ్లు పెండింగులో ఉన్నాయి. వాటిని ఇప్పటికిప్పుడు పరిష్కరించేందుకు మార్గమేదీ కనిపించడం లేదు. దాంతో ఏడాది, రెండేండ్లుగా తిరుగుతోన్న దరఖాస్తుదారులు ఉన్నారు. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డివిజన్‌లోనే 100 శాతం ఫలితాలను పొందలేకపోతున్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రెవెన్యూ చట్టం ద్వారా అమలు చేయడం ద్వారా మరెంత మంది మ్యుటేషన్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందో అంచనా వేయొచ్చు.

ఆటోమెటిక్ మ్యూటేషన్​ చేయలేక పోవడానికి కారణం క్షేత్ర స్థాయి విస్తీర్ణానికి, రెవెన్యూ రికార్డుల్లోని విస్తీర్ణానికి మధ్య అంతులేని తేడా ఉండడమే. ప్రతి గ్రామంలో ఒకటీ రెండు సర్వే నంబర్లలో కాదు. ఏకంగా 20 శాతం సర్వే నంబర్లలో ఈ తేడాలు ఉన్నట్లు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా అసైన్డ్ భూముల్లోనూ ఈ వ్యత్యాసం అధికంగా ఉంది. అలాంటి సందర్భాల్లో ‘ధరణి’ వెబ్ సైట్ టెక్నికల్ నాలెడ్జ్ ఆటోమెటిక్ మ్యూటేషన్​ చేసేందుకు మొరాయిస్తోందని ఓ డిప్యూటీ కలెక్టర్ ‘దిశ’కు ఆదివారం వివరించారు. వీటిని చక్కదిద్దకుండా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖకు అనుసంధానం చేయడం ద్వారా సత్ఫలితాలు రావడం కష్టమేనంటున్నారు.

తప్పుగా గుర్తింపు..

సేత్వార్ ఆధారంగానే ధరణి వెబ్‌సైట్‌లో ప్రతి గ్రామానికి సంబంధించిన రెవెన్యూ రికార్డులను విస్తీర్ణంతో సహా నమోదు చేశారు. ఏయే సర్వే నంబర్లల్లోనైతే రికార్డుల్లో అధికంగా విస్తీర్ణం నమోదు చేయబడిందో(పాసు పుస్తకాల ద్వారా) వాటి మ్యుటేషన్లు సాధ్యం కావడం లేదు. సాంకేతిక సమస్యలతోనే భూ యాజమాన్య హక్కులకు సమస్యలు తలెత్తుతున్నాయి. అసలు భూమి ఉన్నా లేకున్నా పాస్ బుక్కులివ్వడం, భూమి అమ్మకాలు, కొనుగోళ్లు సక్రమంగా నమోదు చేయకపోవడంతో అంతా గందరగోళంలో పడింది. తెలంగాణ మొత్తంగా దాదాపు 60 లక్షల ఎకరాల భూమి అదనంగా నమోదైనట్లు తెలుస్తోంది. ఈ అదనపు భూమి రికార్డుల్లో ఉంది. కానీ అసలు భూమి లేదు. ఈ క్రమంలో కొత్తగా సేత్వార్‌ను రూపొందించడం తప్ప మరో మార్గమేదీ లేదని ఓ డిప్యూటీ కలెక్టర్ స్పష్టం చేశారు.

సరిదిద్దే అవకాశం లేదు..

పట్టాదారుడి పేరు, విస్తీర్ణంలో ఏ మాత్రం తేడా వచ్చినా సరిదిద్దే అవకాశమే స్థానిక అధికారులకు లేదు. పేరులో దీర్ఘం, కొమ్ము వంటివి పొరపాట్లు చోటు చేసుకున్నా సవరించేందుకు ఏండ్లు పడుతోంది. సదరు దరఖాస్తులు వీఆర్వో నుంచి ఆర్ఐ, ఆర్ఐ నుంచి తహసీల్దార్, తహసీల్దార్ నుంచి ఆర్డీఓ, ఆర్డీఓ నుంచి జాయింట్ కలెక్టర్ల వరకు ఫైల్ వెళ్లాల్సిందే. జేసీ సైన్ చేసి ఆర్డీఓకు ఇవ్వాలి. ఆప్షన్ ఇచ్చినప్పుడే సరి చేయాలి. దీనికి ఏళ్లు సమయం పడుతుంది. మహబూబ్ నగర్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో ఓ డిప్యూటీ కలెక్టర్‌కు పది ఎకరాల భూమి ఉంది. అది వారసత్వంగా వచ్చిందే. ఐతే రికార్డుల్లో రెడ్డికి బదులుగా బీసీ అని తప్పుగా పేర్కొన్నారు. అయితే ఏడాది కాలంగా ఆ అధికారి స్థానిక కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కానీ ఇప్పటికీ పరిష్కారం కాలేదు. ఒక డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారికే సమస్య పరిష్కారానికి మార్గం కనిపించడం లేదంటే సామాన్యుల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

Advertisement

Next Story

Most Viewed