జీఎస్టీ గడువుతో పాటు మారటోరియం తప్పనిసరి చేయాలన్న ఆటో డీలర్ల సంఘం!

by Harish |
జీఎస్టీ గడువుతో పాటు మారటోరియం తప్పనిసరి చేయాలన్న ఆటో డీలర్ల సంఘం!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ సెకెండ్ వేవ్ సంక్షోభాన్ని పరిగణలోకి తీసుకుని రాబోయే మూడు నెలలకు జీఎస్టీ చెల్లింపుల పొడిగింపుతో పాటు ఆటోమోటివ్ డీలర్లకు ఆర్థిక సహాయాన్ని అందించాలని ఫాడా ఆర్‌బీఐ, ప్రభుత్వాన్నీ కోరింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి, ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌లకు ఆటో డీలర్ల సంఘం ఫాడా లేఖ రాసింది. ఈ రంగం ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా తక్షణమే సహాయక చర్యలను అందించాలని లేఖలో పేర్కొంది. దేశవ్యాప్తంగా 25 వేల డీలర్‌షిప్‌లు, 15 వేలకు పైగా డీలర్లకు జీఎస్టీ రిటర్నుల దాఖలుకు మూడునెలల గడువును పొడిగించాలని తెలిపింది.

అంతేకాకుండా, టర్మ్ లోన్, స్వల్పకాలిక రుణాలు, క్యాష్ క్రెడిట్ లైన్, కార్పొరేట్ రుణాలను రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్‌డౌన్ రోజులకు సమానమైన మారటోరియం ఇచ్చేలా బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు మార్గదర్శకాలివ్వాలని ఆర్‌బీఐని కోరింది. అన్ని రుణాలపై వడ్డీ రేట్లను 400 బేసిస్ పాయింట్ల మేర 90 రోజులు తగ్గించాలని డీలర్ల సంఘం పేర్కొంది. వాహనాలను కొనుగోలు చేసినవారికి ఈఎంఐ చెల్లింపులపై మారటోరియం కూడా ఇవ్వాలని తెలిపింది.

ఈ చర్యలు వెంటనే తీసుకోకపోతే ఆటో రిటైల్ విభాగంలో ప్రతికూల ప్రభావం ఏర్పడుతుందని, చాలామంది డీలర్‌షిప్‌లు, వారి కుటుంబాలు మనుగడ సాగించలేవని వివరించింది. సెకెండ్ వేవ్ మహమ్మారి గతేడాది మాదిరిగా పట్టణ ప్రాంతాలకే పరిమితం కాకుండా గ్రామీణ డిమాండ్‌పై కూడా అత్యధిక ప్రభావాన్ని చూపిందని ఫాడా లేఖలో వెల్లడించింది.

Advertisement

Next Story