పేరుకు స్మార్ట్‌ సిటీ.. ముక్కులదిరేలా వాసనతో మురుగునీరు

by Sridhar Babu |   ( Updated:2021-10-23 01:02:30.0  )
పేరుకు స్మార్ట్‌ సిటీ.. ముక్కులదిరేలా వాసనతో మురుగునీరు
X

దిశ, కరీంనగర్ సిటీ : స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకొనేందుకు నగరం శరవేగంగా పరుగులు పెడుతుంటే, అక్కడ మాత్రం బురద రోజురోజుకు పెరుగుతున్నది. ఆకర్షణీయంగా మారాల్సిన ఆ ప్రాంతంలో మురుగునీరు మరుగుతోంది. ఆకాశమే హద్దుగా బహుళ అంతస్తుల భవనాలు నిర్మితమవుతున్న ఆ కాలనీలో.. పట్టణ ప్రణాళిక విభాగం నిర్వాకంతో, మౌళిక వసతులు కరువయ్యాయి. కనీసం బహుళ భవనాల్లోని మురుగునీరు బయటకు వెళ్లేందుకు మురికి కాల్వలు కూడా లేక రోడ్లు, ఇళ్ల పక్కన ఉన్న ఖాళీ స్థలాలు మురుగునీటితో నిండిపోయి, ఆ కాలనీలో కంపు రేగుతోంది.

ఆరుమాసాలుగా మురుగు నీరు పారుతుండగా, ముక్కుపుటలదిరే దుర్గంధం వెదజల్లుతున్నది. కొద్దిరోజులుగా ఆ ప్రాంతవాసులు ఇళ్లలో నుంచి బయటకు రాలేకపోతున్నారు. మెయిన్ రోడ్డుకు వెళ్లే దారిపై నీరు పారుతుండగా, అటువైపుగా వెళ్లేవారు అడుగు తీసి అడువేయలేకపోతున్నారు. బల్దియా అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటంలేదని అక్కడి ప్రజలు మండిపడుతున్నారు. ఆహ్లాదకర వాతావరణానికి మారుపేరైన మానేరు కట్టకు అతి సమీపంలో ఉన్న నగరంలోని 15వ డివిజన్ పరిధిలో గల ప్రగతినగర్ కాలనీ ఈ ఏడాది మార్చి మాసం నుంచి కంపు వాసనలో కూరుకుపోయింది. అక్కడ నిర్మించిన ఓ బహుళ అంతస్థుల భవనం నుంచి 24 గంటల పాటు వస్తున్న మురుగునీరు ఇళ్లపక్కనే ఉన్న ఖాళీ స్థలాల్లో నిలిచి దుర్గంధం వెదజల్లుతోంది.

నిబంధనల ప్రకారం రోడ్లు, మురికి కాల్వల నిర్మాణం పూర్తి అయిన తర్వాతే బహుళ అంతస్థుల భవన నిర్మాణానికి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, అధికారులు వీటిని విస్మరించి ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో, ఆ భవనంలో నుంచి వస్తున్న మురుగునీరు కాలనీ మొత్తం పారుతోంది. దీనిపై ఫిర్యాదు చేసినా, అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోకపోవటంతో, దుర్గంధం భరించలేక కొంతమంది ఇళ్ల యజమానులు తాము ఇల్లు విక్రయించి, ఇతర ప్రాంతాలకు వెళ్తామంటూ స్థానిక ప్రజాప్రతినిధుల వద్ద మొరపెట్టుకున్నారు.

అయినా, అక్కడ మురికి కాల్వల నిర్మాణం చేపట్టేందుకు బల్దియా యంత్రాంగం గాని, బహుళ అంతస్థుల భవన యజమానులు కానీ స్పందించక పోవటం పట్ల తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మురుగునీటితో దోమలు పెరుగుతూ, డెంగ్యూ, ఇతర వ్యాధులు ప్రబలుతుండగా, బల్దియా యంత్రాంగం దృష్టి సారించకపోవటం, పాలకవర్గ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది.

Advertisement

Next Story

Most Viewed