ముంపులోనే లోతట్టు ప్రాంతాలు

by srinivas |
ముంపులోనే లోతట్టు ప్రాంతాలు
X

దిశ, ఏపీ బ్యూరో: కృష్ణా నదికి వరద ఉధృతి తగ్గలేదు. ప్రకాశం బ్యారేజీకి 9 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చే అవకాశమున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దిగువన లంక గ్రామాలు, లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత పునరావాస కేంద్రాలకు వెళ్లాలని కలెక్టర్ ఇంతియాజ్ ప్రజలకు సూచించారు. ఆ దిశగా అధికారులను పురమాయించారు. ఇప్పటిదాకా 22 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1736 కుటుంబాలకు చెందిన 5,025 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఒక్క కృష్ణా జిల్లాలోనే 14,400 హెక్టార్లలో వరి, 4,568 హెక్టార్లలో పండ్ల తోటలు దెబ్బతిన్నట్లు అంచనా వేశారు.

31 మండలాలకు సంబంధించి 32 గ్రామాలు వరద తాకిడికి గురైనట్లు గుర్తించారు. జగ్గయ్య పేట, చందర్లపాడు, కంచికచర్ల, పమిడిముక్కల, ఇబ్రహీంపట్నం, కంకిపాడు, మోపిదేవి, చల్లపలి, అవనిగడ్డ, తోట్లవలూరు, నాగాయలంక మండలాల్లో రెవెన్యూ, ఇతర శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. సహాయక చర్యల్లో పాల్గొనడానికి విపత్తుల నివారణ దళాలు సిద్ధంగా ఉన్నాయి. అధిక వర్షాల కారణంగా ఇంతవరకు అందిన సమాచారం మేరకు జిల్లాలో 119 కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నట్లు కలెక్టర్కు నివేదికలు అందాయి. 24 ఇళ్లు పూర్తిగా, 112 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు అంచనా వేశారు.

వరద ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు

మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాలో తమ్మిలేరు శాంతించింది. వరద ఉధృతి తగ్గింది. కానీ చాలా గ్రామాలు బురదలోనే ఉన్నాయి. ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు వరద ప్రాంతాల్లో పర్యటించారు. అధికారులను యుద్ధప్రాదికన సహాయక చర్యలు, నష్టం అంచనాలు రూపొందించేందుకు సమాయత్తం చేశారు. దెబ్బతిన్న చేపల చెరువులు, రొయ్యల చెరువుల యజమానులను ఆదుకుంటామని హామీనిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed