రెచ్చిపోతున్న భూ బకాసురులు.. పట్టించుకోని అధికారులు

by Shyam |
రెచ్చిపోతున్న భూ బకాసురులు.. పట్టించుకోని అధికారులు
X

దిశ, జవహార్ నగర్: జవహర్ నగర్ లో భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ భూములు, ఖాళీ జాగ కనిపిస్తే పాగా వేస్తున్నారు. రెవెన్యూ, కార్పొరేషన్, పోలీస్ అధికారుల కళ్లకు గంతలు కట్టి భూములను కాజేస్తున్నారు. కబ్జాదారులపై సాక్ష్యాలతో సహా ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో అక్రమార్కులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. అధికార పార్టీ అండదండలతో కబ్జాల పర్వం యథేచ్ఛగా సాగుతోందనే విమర్శలు ఉన్నాయి.

జవహర్ నగర్ కార్పొరేషన్ గా అవతరించినా ప్రజలకు తప్పని తిప్పలు. ఈ మధ్య ఉత్కంఠగా మారిన సర్వే నంబర్ 474 స్థలంలో ప్రహరీ నిర్మాణంపై ఒకపక్క ప్రజా ప్రతినిధులు, మరోపక్క మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగిన కథ ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. దీనిపై సమగ్ర విచారణ చేపట్టిన రెవెన్యూ అధికారులు నాలుగు రోజుల క్రితం కాప్రా తహసీల్దార్ గౌతమ్ కుమార్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. దీనికి అసలు కారణం గతంలో కరీంనగర్ జిల్లాలోని పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న బందేలు ప్రతాప్ అలియాస్ లిల్లీ ప్రతాప్ అని చెప్పారు. మూడు జిల్లాలకు ఇన్​చార్జి కలెక్టర్ అని అధికారులను తప్పుదోవ పట్టించి ప్రహరీ నిర్మించాడని ఆధారాలతో సహా బయటపెట్టారు. అయినా ఇప్పటివరకు జవహర్ నగర్ పోలీసులు ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తుంది.

ఈ మధ్య జవహార్ నగర్ అంతటా చర్చనీయాంశంగా మారిన సర్వేనెంబర్ 510లో నందనవనం చిల్డ్రన్స్ పార్క్ కేసులో అధికార పార్టీకి చెందిన నేతలపై మున్సిపల్ కమిషనర్ పేర్లతో సహా పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెల రోజుల క్రితం సర్వే నంబర్ 432 లో అక్రమ నిర్మాణాల తొలగింపులో భాగంగా బందోబస్తుకు వెళ్లిన సర్కిల్ ఇన్​స్పెక్టర్ భిక్షపతి రావు పై పెట్రోల్ దాడి కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ కేసులో నిందితులుగా ఉన్న అధికార పార్టీకి చెందిన ఇద్దరు ప్రజా ప్రతినిధులు, ఇతర పార్టీకి చెందిన అధ్యక్షుడు, నాయకులపై స్వయంగా మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు చేశారు.

సర్వే నంబర్ 613, 614లోని ప్రభుత్వ భూమిలో ప్లాట్లు చేసి అమాయక ప్రజలకు అమ్మిన అధికార పార్టీకి చెందిన ఉప స్థాయి పదవిలో ఉన్న మరొక ప్రజా ప్రతినిధి పై స్థానిక తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భూ మాఫియా కేసులో ఇంత మంది ప్రజా ప్రతినిధులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదైనా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక మర్మమేమిటని పలువురు వాపోతున్నారు.

ఎక్కడో కరీంనగర్ జిల్లాలో పలు కేసుల్లో నిందితులుగా ఉన్న లిల్లిప్రతాప్ కు జవహర్ నగర్ కు సంబంధం ఏమిటని? జవహర్ నగర్ పోలీస్ అధికారుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా తీసుకుని లిల్లిప్రతాప్ వెనుక స్థానిక అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులే ఇదంతా చేయించి ఉంటారని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పలు భూ కబ్జా కేసుల్లో నిందితులుగా ఉన్న వారు స్థానిక అధికార పార్టీకి చెందిన వారే కావడంతో పెద్దాయన తన పలుకుబడిని ఉపయోగించి అధికారులను బదిలీ చేయిస్తున్నారని జవహర్ నగర్ ప్రజల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు మేల్కొని కేసులు నమోదైన వారిపై చర్యలు తీసుకోవాలని జవహర్ నగర్ ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed