సైకిల్ పోయింది.. సాయం అందింది

by  |
సైకిల్ పోయింది.. సాయం అందింది
X

దిశ, వెబ్‌డెస్క్ :
విమానం నడిపేంత ఎత్తుకు ఎదిగినా సరే.. మొదటిసారి సైకిల్ నడిపినప్పుడు వచ్చినంత మజా ఏదీ ఇవ్వదు. బాల్యంలో సైకిల్ నేర్చుకోవడం.. ఓ జీవితకాల జ్ఞాపకం. ఆ క్రమంలో ఎన్నోసార్లు కిందపడి దెబ్బలు తగిలినా.. నేర్చుకునే వరకు వదిలిపెట్టం. ఏ కాస్త టైమ్ దొరికినా, సైకిల్‌పై ఊరంతా చక్కర్లు కొట్టేస్తాం. కాగా.. ఆస్ట్రేలియా, సరీనా పట్టణంలో నివసిస్తున్న లాక్లిన్ అనే పిల్లోడు కూడా అంతే. ఈ చిన్నోడు రోజూ తన సైకిల్‌పై హాయిగా తిరిగేవాడు. కానీ, అనుకోకుండా ఓ రోజు తన సైకిల్ పోయింది. దాంతో తమ కమ్యూనిటీ ప్రజలంతా ఏకమై ఏం చేశారో తెలుసా?

సరీనాలో నివసిస్తున్న లాక్లిన్‌కు సైకిల్ నడపడం అంటే చాలా ఇష్టం. కొద్ది రోజుల కిందట ఇంట్లో వాళ్లు ఏదో పని చెప్పగా.. ఈ పదేళ్ల బాలుడు సైకిల్‌ మీద బయటకెళ్లాడు. ఓ చోట సైకిల్ పార్క్ చేసి, లాక్ చేసిన లాక్లిన్.. అనుకోకుండా తన సైకిల్ కీ పోగొట్టుకున్నాడు. ఎంత వెతికినా దొరకలేదు. దీంతో అతడు సైకిల్‌ను అక్కడే వదిలేసి ఇంటికొచ్చేశాడు. తర్వాతి రోజు డూప్లికేట్ కీ తో అక్కడికెళ్లి చూస్తే సైకిల్ లేదు, ఎవరో పట్టుకెళ్లిపోయారు. దాంతో లాక్లిన్ ఏడుస్తూ ఇంటికొచ్చి.. తల్లి కిమ్‌తో జరిగిన విషయం చెప్పాడు. కొడుకు బాధను చూసి.. తల్లి కూడా బాధ పడింది. ఈ విషయం కాస్త, అక్కడి లోకల్ కమ్యూనిటీ ప్రజలకు తెలిసింది. లాక్లిన్ ఏడుస్తుండటం చూసిన వారంతా ఎలాగైనా.. లాక్లిన్‌ ముఖంలో సంతోషం చూడాలని నిర్ణయించుకున్నారు.

ఫండ్ రైజింగ్ ద్వారా డబ్బులు సేకరించారు. లాక్లిన్ బర్త్ డే రోజున జమ చేసిన డబ్బులతో సైకిల్ కొని, బహుమతిగా అందించి.. ఆ చిన్నోడికి సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇక లాక్లిన్.. ఆ సైకిల్‌ను చూడగానే, సంతోషంతో చిందులు వేశాడు. ఆనందంతో కన్నీళ్లు కార్చాడు. కమ్యూనిటీ ప్రజలంతా చేసిన సాయానికి.. అతని తల్లి కూడా ఎంతో మురిసిపోయింది. అంత మంచి మనుషుల మధ్య నివసిస్తున్నందుకు తామెంతో లక్కీ అంటూ ఆమె భావోద్వేగానికి గురైంది.


Next Story

Most Viewed