- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తొలి రోజు ఆస్ట్రేలియాదే ఆధిపత్యం
దిశ, స్పోర్ట్స్ : విదేశీ గడ్డపై తొలి పింక్ బాల్ టెస్టు ఆడుతున్న టీమ్ ఇండియా తొలి రోజు పేలవ ప్రదర్శన చేసింది. ఆసీస్ బౌలర్లు నిప్పులు చెరిగే బంతులు విసురుతూ భారత బ్యాట్స్‌మెన్ సహనానికి పరీక్ష పెట్టారు. తొలి ఓవర్లోనే పృథ్వీషా అవుటవడంతో పాటు మయాంక్ అగర్వాల్ విఫలమవడంతో మిగతా బ్యాట్స్‌మెన్ రక్షణాత్మకంగా ఆడారు. మూడు సెషన్లలో దాదాపు ఆస్ట్రేలియానే ఆధిపత్యం చెలాయించింది. కోహ్లీ అర్దసెంచరీ.. పుజారా, రహానేల బ్యాటింగ్‌తో టీమ్ ఇండియా కోలుకున్నది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ ఓవల్‌లో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో టీమ్ ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. విదేశీ గడ్డపై ఆడుతున్న తొలి పింక్ బాల్ టెస్టులో ఓపెనర్లు పృథ్వీ షా (0), మయాంక్ అగర్వాల్ (17) విఫలమయ్యారు. వార్మప్ మ్యాచ్‌లలో విఫలమైన పృథ్విషా తన పేలవ ఫామ్‌ను కొనసాగించాడు. షా బ్యాటింగ్‌లోని లోపాలను కనిపెట్టిన మిచెల్ స్టార్క్ దాన్ని తనకు అనుకూలంగా మలచుకున్నాడు. రెండో బంతికే షాను స్టార్క్ బౌల్డ్ చేశాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ క్రీజులో నిలదొక్కుకుంటున్నాడు అనుకున్న సమయంలో పాట్ కమ్మిన్స్ అతడిని బౌల్డ్ చేశాడు. దీంతో ఇండియా 32 పరుగులకు రెండో వికెట్ కోల్పోయింది. దీంతో లంచ్ సమయానికి భారత జట్టు 41 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఇక రెండో సెషన్‌లో పుజార, కోహ్లీ ఆసీస్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. కోహ్లీ అడపాదడపా బౌండరీలు బాదాడు. కానీ టీమ్ ఇండియా నయావాల్ పుజార మాత్రం ఆసీస్ బౌలర్లతో ఒక ఆటఆడుకున్నాడు. ఎలాంటి బంతినైనా డిఫెన్స్ ఆడుతూ క్రీజులో పాతుకొని పోయాడు. ఒక విధంగా వికెట్లు పడకుండా ఆసీస్ బౌలర్లకు విసుగు తెప్పించాడు. మూడో వికెట్‌కు కోహ్లీ, పుజార కలసి 68 పరుగులు జోడించారు. 50వ ఓవర్‌లో భారత జట్టు 100 పరుగులు పూర్తి చేసుకుంది. ఆ వెంటనే పుజార అవుటయ్యాడు. లయన్ బౌలింగ్‌లో లబుషేన్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. దీంతో టీ విరామ సమయానికి భారత్ స్కోర్ 107/3. ఈ సెషన్‌లో ఇండియా 66 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయింది.
ఇక కీలకమైన మూడో సెషన్‌లో కెప్టెన్ కోహ్లీ, అజింక్య రహానే కాస్త దూకుడు పెంచారు. తొలి రెండు సెషన్లు కలిపి కేవలం 107 పరుగులే రావడంతో తమ బ్యాటుకు పని చెప్పారు. బౌండరీలు బాదడమే కాకుండా.. సింగిల్స్, డబుల్స్ తీస్తూ స్కోరు బోర్డును పరుగెత్తించారు. ఈ క్రమంలో 123 బంతులు ఎదుర్కున్న విరాట్ కోహ్లీ 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా బౌండరీలు బాదుతూ కోహీ, రహానే స్కోరు పెంచారు. అయితే ఒక అనవసరమైన పరుగు కోసం పిలిచిన రహానే.. కోహ్లీ పరుగు మొదలు పెట్టిన తర్వాత నో చెప్పాడు. అప్పటికే హాజెల్‌వుడ్ బంతిని నాన్ స్ట్రైకెర్ ఎండ్‌కు విసరడం లయన్ వికెట్లను గిరాటేయడం జరిగింది.
దీంతో రహానేతో కలసి 88 పరుగుల భాగస్వామ్యం అందించిన కోహ్లీ (74) పెవిలియన్ చేరాడు. సెంచరీ చేస్తాడని భావించిన కోహ్లీ.. అనవసరంగా రనౌట్ కావడంతో భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ తర్వాత కాసేపటికే అజింక్య రహానే (42) స్టార్క్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు. ఆ తర్వత హనుమ విహారి (16) హాజెల్‌వుడ్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయి పెవీలియన్ చేరాడు. భారత జట్టు మూడో సెషన్‌లో పరుగులు రాబట్టినా కేవలం 18 పరుగుల వ్యవధిలో మూడు కీలక వికెట్లు కోల్పోయింది. చివర్లో వృద్దిమాన్ సాహ (9 నాటౌట్), రవిచంద్రన్ అశ్విన్ (15 నాటౌట్) మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడారు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 6 వికెట్లు కోల్పోయి 233 పరుగులు చేసింది. మిచెల్ స్టార్క్ 2 వికెట్లు తీయగా.. హాజెల్‌వుడ్, నాథన్ లయన్ చెరో వికెట్ తీశారు.
స్కోర్ బోర్డు..
ఇండియా తొలి ఇన్నింగ్స్
పృథ్వీషా (బి) మిచెల్ స్టార్క్ 0, మయాంక్ అగర్వాల్ (బి) పాట్ కమ్మిన్స్ 17, చతేశ్వర్ పుజార (సి) లబుషేన్ (బి) లయన్ 43, విరాట్ కోహ్లీ (రనౌట్) 74, అజింక్య రహానే (ఎల్బీడబ్ల్యూ) స్టార్క్ 42, హనుమ విహారి (ఎల్బీడబ్ల్యూ) హాజెల్‌వుడ్ 16, వృద్దిమాన్ సాహ 9 నాటౌట్, రవిచంద్రన్ అశ్విన్ 15 నాటౌట్ ; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (89 ఓవర్లు) 233/6
వికెట్ల పతనం : 1-0, 2-32, 3-100, 4-188, 5-196, 6-206
బౌలింగ్ : మిచెల్ స్టార్క్ (19-4-49-2), జోష్ హాజెల్‌వుడ్ (20-6-47-1), పాట్ కమ్మిన్స్ (19-7-42-1), కామెరూన్ గ్రీన్ (9-2-15-0), నాథన్ లయన్ (21-2-68-1), మార్నస్ లబుషేన్ (1-0-3-0)