టెన్నిస్‌లో హాక్-ఐ టెక్నాలజీ

by Shyam |
టెన్నిస్‌లో హాక్-ఐ టెక్నాలజీ
X

దిశ, స్పోర్ట్స్ : కరోనా కారణంగా క్రికెట్‌లో కొన్ని నిబంధనలు తాత్కాలికంగా చేర్చారు. ఇతర క్రీడల్లో కూడా పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కోర్టులో లైన్ అంపైర్ల విధానానికి స్వస్తి పలకాలని నిర్ణయించింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని క్రీడల్లో గత కొన్నేళ్లుగా వాడుతున్న హాక్-ఐ టెక్నాలజీని వాడుకోవడానికి రంగం సిద్ధం చేసింది. టెన్నిస్‌లో హాక్-ఐ టెక్నాలజీని 2006 నుంచి పాక్షికంగా వాడుతున్నారు. అయితే ఇకపై పూర్తి స్థాయిలో ఈ టెక్నాలజీని వాడటానికి ఏటీపీ నిర్ణయించింది. దీంతో లైన్ అంపైర్లు ఇకపై ఉండరని.. కేవలం చైర్ అంపైర్ మాత్రమే మ్యాచ్ మొత్తం పర్యవేక్షిస్తారని ఏటీపీ చెబుతున్నది.

ఏలా పని చేస్తుంది..?

హాక్-ఐ టెక్నాలజీని ఫుట్‌బాల్, క్రికెట్‌లో వినియోగిస్తున్నారు. బంతి ఎక్కడ పడింది అనేది ఈ టెక్నాలజీ ద్వారా కచ్చితంగా తెలుసుకునే వీలుంది. క్రికెట్‌లో ఆటోమెటిక్ నోబాల్ విధానం కొద్ది కాలం క్రితం ప్రవేశపెట్టారు. దీనికి హాక్-ఐ టెక్నాలజీనే వినియోగిస్తున్నారు. అదే విధంగా టెన్నిస్‌లో బంతి ఎక్కడ పడిందనే విషయాన్ని హాక్-ఐ ద్వారా వెంటనే తెలుసుకొనే వీలుంది. ఇంతకు ముందు ఆటగాళ్లు కొట్టిన బంతి బయట పడిందా లేదా లోపల పడిందా? సర్వీస్ సరిగా చేశారా లేదా అనే విషయాలు లైన్ అంపైర్ల ద్వారా తెలిసేది.

కానీ ఇకపై కొత్త టెక్నాలజీ ద్వారా అంపైర్ల అవసరం లేకుండా పోయింది. 2006 నుంచి టెన్నిస్‌లో ఈ టెక్నాలజీని పాక్షికంగా వాడుతున్నారు. ఆటగాళ్లు రిఫరల్ కోరినప్పుడు మాత్రమే దీన్ని ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ఇక పూర్తి స్థాయిలో వినియోగించాలని ఏటీపీ నిర్ణయించింది. ప్రస్తుతం కోర్టులో ఆటగాళ్లు కాకుండా ఏడుగురు లైన్ అంపైర్లు, ఒక చైర్ అంపైర్, ఆరుగురు బాల్ కిడ్స్ (బంతిని అందించే వాళ్లు) ఉంటారు. కానీ ఇప్పుడు లైన్ అంపైర్లను పూర్తిగా తీసేస్తుండటంతో కోర్టులో ఏడుగురికి మాత్రమే అనుమతి ఉంటుంది. కేవలం చైర్ అంపైర్, బాల్ కిడ్స్ మాత్రమే ఉంటారు.

ఆస్ట్రేలియా నుంచి ప్రారంభం

హాక్-ఐ లైవ్ సిస్టమ్ అనే టెక్నాలజీని పూర్తి స్థాయిలో 2018లో జరిగిన ఏటీపీ నెక్ట్స్ జెన్ ఫైనల్స్‌లో ప్రయోగాత్మకంగా ఉపయోగించారు. ఆ తర్వాత గత ఏడాది సిన్సినాటీ మాస్టర్స్‌లో ఉపయోగించారు. అక్కడ విజయవంతం కావడంతో అన్ని హార్డ్ కోర్ట్ మ్యాచ్‌లకు ఈ టెక్నాలజీ వినియోగించుకోవాలని అనుకుంటున్నారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఏటీపీ టోర్నీలతో పాటు ఆస్ట్రేలియా ఓపెన్‌లో హాక్-ఐ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. అయితే ఈ టెక్నాలజీ కేవలం హార్డ్ కోర్టులకే పరిమితం కానుంది. గ్రాస్ కోర్టు, క్లే కోర్టుల్లో ఇంకా కచ్చితత్వంపై ప్రయోగాలు జరుగుతున్నాయి.

మరోవైపు ఈ టెక్నాలజీని ఉపయోగించడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే క్యాష్ రిచ్ టోర్నీల్లోనే ఉపయోగించనున్నారు. ఒక కోర్టులో, ఒక టోర్నీకి హాక్-ఐ టెక్నాలజీని ఉపయోగించడానికి రూ. 18 లక్షలు ఖర్చవుతుంది. ఇండియాలో జరిగే టోర్నీలు ఎక్కువగా పూణేలోని బేలెవాడీ టెన్నిస్ స్టేడియంలో జరుగుతాయి. ఇక్కడి మూడుకోర్టుల్లో హాక్-ఐ సిస్టం ఇన్‌స్టాల్ చేయడానికి రూ. 55 లక్షలు ఖర్చు అవుతుంది. కానీ ఇక్కడ ఏటీపీ చాలెంజర్‌లో గెలిస్తే విజేతకు ఇచ్చే మొత్తమే రూ. 40 లక్షలు దాటదు. దీంతో ఈ టెక్నాలజీని కేవలం క్యాష్ రిచ్ టోర్నీలకు మాత్రమే పరిమితం చేయనున్నారు.

Advertisement

Next Story

Most Viewed