‘తెలిసేలోగా అంత్యక్రియలు పూర్తి’

by  |
‘తెలిసేలోగా అంత్యక్రియలు పూర్తి’
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మృతదేహాల పట్ల వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనడానికి తాజా ఘటనే సాక్ష్యంగా నిలిచింది. ఒకరి మృతదేహాన్ని వేరొక రోగి కుటుంబసభ్యులకు ఇచ్చారు. ఆ మృతదేహానికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు కూడా నిర్వహించారు. ఈ ఘటన ముంబైలోని సియోన్ దవాఖానలో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… గతనెల 28న రోడ్డు ప్రమాదంలో అంకుశ్(27) అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం సియోన్ ఆస్పత్రిలో చేర్చారు.

దాదాపు 18 రోజుల పాటు చికిత్స పొందిన అంకుశ్ ఆదివారం ఉదయం మరణించారు. వైద్యులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అంకుశ్ కుటుంబ సభ్యులు సాయంత్రం 4 గంటలకు వస్తామని సిబ్బందికి చెప్పారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. అయితే అదే సమయంలో వ్యక్తిగత సమస్యలతో ఆత్మహత్య చేసుకున్న హేమంత్ దిగంబర్ అనే వ్యక్తి మృతదేహానికి కూడా పోస్టుమార్టం జరిగింది. అతడి మృతదేహాన్ని తీసుకోవడానికి హేమంత్ కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు వైద్య సిబ్బంది వారికి అంకుశ్ మృతదేహాన్ని అప్పగించారు.

హేమంత్ కుటుంబం ఆ మృతదేహాన్నితీసుకెళ్లి అంత్యక్రియలు కూడా నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు అంకుశ్ కుటుంబం మృతదేహం కోసం దవాఖానకు వచ్చినప్పుడు సిబ్బంది వారికి హేమంత్ మృతదేహాన్ని అప్పగించారు. గుర్తించిన అంకుశ్ తల్లిదండ్రులు హేమంత్ మృతదేహాన్ని తీసుకెళ్లడానికి నిరాకరించి, ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు దవాఖానకు చేరుకొని అంకుశ్ కుటుంబం నుంచి స్టేట్‌మెంట్ తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన తరువాత సియోన్ దవాఖాన యాజమాన్యం ఇద్దరు సిబ్బందిని సస్పెండ్ చేసింది.

Read Also…

పోలీసుల పేరిట మోసాలు..ముఠా అరెస్ట్…


Next Story