అద్దం పోగొట్టుకున్న ఆస్ట్రోనాట్!

by Harish |
అద్దం పోగొట్టుకున్న ఆస్ట్రోనాట్!
X

ఇంగ్లీష్‌లో అంతరిక్షం ఆధారంగా వచ్చిన సినిమాల్లో ఒక సీన్ తప్పనిసరిగా ఉంటుంది. ఆ సీన్‌లో స్పేస్‌షిప్‌‌లో ఏదో ఒక సమస్య తలెత్తుతుంది. దాన్ని బాగు చేయడానికి బయటికెళ్లి స్పేస్ వాక్ చేయాల్సి ఉంటుంది. సరిగ్గా అది బాగు చేస్తున్నపుడు వ్యోమగామి దగ్గరి నుంచి ఏదో ఒక వస్తువు జారి శూన్యంలోకి వెళ్లిపోతుంటుంది. ఇలాంటి సన్నివేశమే ఇప్పుడు నిజజీవితంలోనూ జరిగింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఏదో చిన్న బ్యాటరీ వర్క్ చేయాల్సి వచ్చింది. దాన్ని బాగు చేయడానికి బయటికెళ్లిన వ్యోమగామి తనతో పాటు తీసుకెళ్లిన అద్దాన్ని పోగొట్టుకున్నారు. ఇప్పటికే అంతరిక్షంలో తిరుగుతున్న చెత్తకు ఈ అద్దం కూడా తోడైందని ఈ విషయం గురించి నాసా చమత్కరించింది.

కమాండర్ క్రిస్ క్యాసిడీ చేతిలో నుంచి అనుకోకుండా అద్దం జారిపోయిందని, ఆ వస్తువు వల్ల స్పేస్ వాక్ చేయడానికి కానీ, ఐఎస్ఎస్‌కు కానీ ఎలాంటి నష్టం వాటిల్లబోదని నాసా వెల్లడించింది. అంతరిక్షంలో పాడైపోయిన శాటిలైట్లు, ఇతర విడిభాగాలు, అంతరిక్ష చెత్త రూపంలో భూమి చుట్టూ దాదాపు 20,000లకు పైగా వస్తువులు తిరుగుతున్నాయి. వీటిలో పెద్ద పెద్ద వాటిని ట్యాగ్ చేసి, గుర్తించడం సులభం. ఒకవేళ ఇవి అంతరిక్ష కేంద్రం వైపుగా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిస్తే వాటిని దూరంగా ఉన్నపుడు పేల్చేసి, ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. కానీ అద్దం లాంటి చిన్న చిన్న వస్తువులను ట్యాగ్ చేసి గుర్తించడం కష్టం కాబట్టి, అవి ఏదైనా ముఖ్యమైన ప్రదేశంలో తగిలి నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed