డిస్కవరీ ఆఫ్ ది సెంచరీ.. ‘సనౌలి యోధులు’

by Anukaran |
accidental discovery3
X

దిశ, ఫీచర్స్: అతి పురాతన కాలంలో అనగా 4 వేల ఏళ్ల కిందటే భారతీయులు కాంస్య హెల్మెట్(తల కవచం), కుండలు, రథాలు యుద్ధాలకు వాడారని మీకు తెలుసా? హరప్పా, సింధూ నాగరికత కాలంలో రథాలు వాడినట్లు చరిత్రలో పేర్కొంటుండగా, అంతకంటే ముందే లేదా సమకాలీన సమయంలో భారత్‌కి చెందిన యోధులు కాంస్య వస్తువులు, రథాలు, చెక్కతో తయారుచేసిన కళాఖండాలు విరివిగా వాడినట్లు భారత పురావస్తు శాఖ (ASI) ధ్రువీకరించింది. ‘సీక్రెట్స్ ఆఫ్ సనౌలి’ పేరిట డిస్కవరీ ప్లస్ చానల్ డాక్యుమెంటరీ రూపొందించి ప్రసారం చేస్తోంది. ఇంతకీ ఈ విషయాలను పురావస్తు శాఖ ఎలా కనుగొంది? ఈ యోధులు ఏ ప్రదేశానికి చెందినవారు? వారి సంస్కృతి, నాగరికత ఎలా ఉండేది? యోధులకు సంబంధించిన అవశేషాలు ఎక్కడ బయటపడ్డాయి? ఈ స్టోరీ చదివి మీరూ తెలుసుకోండి.

accidental discovery

ఉత్తరప్రదేశ్‌లోని బాఘ్‌పట్ జిల్లా సనౌలి గ్రామానికి చెందిన రైతు శ్రీరాం శర్మ 2005లో తన వ్యవసాయ క్షేత్రానికి రోజు మాదిరిగానే వెళ్లాడు. తన పొలంలోని భూమిని చదును చేస్తుండగా అస్థిపంజరం, రాగి కుండలు బయటపడ్డాయి. విషయం మీడియాలో స్థానికంగా సంచలనమైంది. భారత పురావస్తు శాఖ బృందం రంగంలోకి దిగింది. రైతు శర్మ భూమిలో తవ్వకాలను ప్రారంభించింది. 13 నెలల పాటు తవ్వకాలు జరిపి రథాలు, శవపేటికలు, కుండలు, అస్థిపంజరాలు, ప్రపంచంలోనే అతి పురతాన కాపర్ హెల్మెట్ కనుగొన్నారు. చెక్కతో తయారు చేయబడ్డ కళాఖండాలు, ఇతర కాంస్య కవచాలు చెక్కుచెదరకుండా అలానే ఉన్నాయి. ఇవి 4 వేల ఏళ్ల కిందటివని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ‘ఈ ప్రదేశంలో బయటపడ్డ కాంస్య కొలిమి, ఇతర అవశేషాలు, చెక్కతో రూపొందించబడిన వస్తువుల ఆధారంగా చరిత్రను అధ్యయనం చేస్తున్నాం. ఇంకా సమయం పడుతుంది. శవపేటికలు ఇతర వస్తువులపై రాగి కోటింగ్స్ ఎలా పెట్టారు? అనే విషయాలపై పరిశోధన చేస్తున్నాం’ అని సైట్ ఇన్‌చార్జి దిశా అహ్లువాలియా తెలిపారు.

తవ్వకాల్లో బయటపడ్డ అవశేషాల ఆధారంగా సనౌలిలో ఆ కాలంలో ఏర్పాటు చేయబడ్డ భారత అతిపెద్ద శ్మశానవాటిక అని పురావస్తు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ సనౌలి యోధుల తెగ ఆ కాలంలోనే కాంస్య రథాలు వాడినట్లు భావిస్తున్నారు. తద్వారా ఆర్యన్ల దండయాత్ర సిద్ధాంతం కల్పితమని అంటున్నారు. అయితే ఈ విషయమై ఇంకా పరిశోధన జరగాల్సి ఉంది. అయితే ఆ కాలానికి సమకాలీకంగా ఉండే దే మెసపటోమియా, సుమేరియా నాగరికతలో గుర్రపు రథాలను ఉపయోగించారు. కాగా తవ్వకాల్లో బయటపడిన రథాలు కూడా గుర్రాలతోనే నడిచేవని నమూనాల ఆధారంగా శాస్త్రవేత్తలు విశ్లేషించారు. హరప్పా నాగరికత కాలంలో ఎద్దులతో నడిచే రథాలున్నట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు. భారత పురావస్తు శాఖ సనౌలిలో తొలిసారి 2005లో 13 నెలల పాటు తవ్వకాలు జరపగా, 2018 నుంచి 2019 వరకు రెండు సార్లు తవ్వకాలు జరిపింది.

accidental discovery2

సనౌలిలో కనుగొన్న అవశేషాలపై పూర్తి వివరాలతో డిస్కవరీ ప్లస్ చానల్ 55 నిమిషాల డాక్యుమెంటరీని రూపొందించింది. ఇది గత నెల 9 నుంచి స్ట్రీమ్ అవుతోంది. ఈ డాక్యుమెంటరీకి నీరజ్ పాండే దర్శకత్వం వహించగా వెటరన్ యాక్టర్ మనోజ్ భాజ్‌పేయి నటించారు. ఈ తవ్వకాలపై నిపుణులు ఐఐటీ గాంధీనగర్ ప్రొఫెసర్ డాక్టర్ వీ.ఎన్.ప్రభాకర్, డాక్టర్ బీ.ఆర్.మణి కూడా రీసెర్చ్ చేస్తున్నారు. ఇక్కడ కనుగొనబడే విషయాలు పాశ్చాత్య ఆధిపత్య కథనాలను ప్రశ్నిస్తున్నాయని వివరిస్తున్నారు. సనౌలి యోధులు హరప్పా నాగకరితలో ఉన్నారా? వారి సమకాలీకులేనా? అన్న విషయాలు పురావస్తు వస్తువులు, అవశేషాల ఆధారంగా కనుగొనాల్సి ఉంది. ఆర్కియాలజిస్టులకు లభించిన రథాలు, టార్చ్, కత్తులు, శవపేటికలు, కవచాలు, హెల్మెట్ కాంస్యంతో రూపొందించినవి కావడంతో సనౌలి యోధుల తెగకు కాంస్య వినియోగం గురించి తెలుసని భావిస్తున్నారు. తద్వారా వారు హరప్పా నాగరికతలో భాగమేనని, కాంస్యయుగ ప్రతినిధులని కొందరు చెప్తున్నారు. అయితే ఇందుకు శాస్త్రీయ ఆధారాలైతే ఇంకా లభించలేదు.

accidental discovery4

‘2005లో జరిపిన తవ్వకాల్లో లభించిన కుండల సైజు, వాటి తయారీకి వాడిన మెటీరియల్ ఆధారంగా అవి హరప్పా నాగరికతకు చెందినవని నిర్ధారించాం. కానీ రథాలు మాత్రం హరప్పా కాలం నాటివి కావు’ అని భారత పురావస్తు శాఖ డైరెక్టర్ డాక్టర్ సంజయ్ కుమార్ మంజుల్ చెప్పారు. పురావస్తు అవశేషాల పరిశీలనలో భాగంగా శాస్త్రవేత్తలకు లభించిన కోంబ్(దువ్వెన), మిర్రర్, మణిపూసల ఆధారంగా సనౌలి వాసులు ఫిజికల్ అప్పియరెన్స్‌కు ప్రాధాన్యతనిచ్చినట్లు తెలుస్తోంది. శవపేటిక‌పై భాగంలో కాపర్ పూత, లోపలి అస్థి పంజరంతో పాటు బాణం, విల్లును పాతిపెట్టడం ద్వారా వారు కర్మలు పాటించేవారని అనుకుంటున్నారు. సైంటిఫిక్ టెక్నిక్స్‌తో ఈ ప్రదేశంలో ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉందని, ఇక్కడి ఫైండింగ్స్ చరిత్ర పరిణామ క్రమాన్ని అంచన వేసేందుకు ఉపయోగపడతాయని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Advertisement

Next Story