అశ్వినా.. జడేజానా?

by Shyam |
అశ్వినా.. జడేజానా?
X

గత నెలలో కివీస్ పర్యటనకు వెళ్లిన టీమ్ ఇండియా టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసినా.. ఆ తర్వాత జరిగిన వన్డే సిరీస్‌ను ఆతిథ్య జట్టుకు అప్పగించేసింది. ఇక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా కివీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇటు బ్యాట్స్‌మెన్ అటు బౌలర్లు చేతులెత్తేయడంతో భారత్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు ఇదే తొలి పరాజయం. కాగా, రెండోదైన ఆఖరి టెస్టు రేపు క్రైస్ట్‌చర్చ్‌లోని హెగ్లే ఓవల్ స్టేడియంలో మెదలవనుంది.

తొలి టెస్టులో ఓటమి కారణంగా రెండో టెస్టుకు జట్టులో మార్పులు చోటుచేసుకునే అవకాశాలున్నాయి. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మొదటి టెస్టులో 3 వికెట్లు తీసినా బ్యాటింగ్‌లో మాత్రం విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో రెండో టెస్టులో అశ్విన్‌ లేదా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాల్లో ఎవరిని ఆడించాలన్న విషయంపై యాజమాన్యం డైలమాలో ఉన్నట్టుగా సమాచారం. ఇదే విషయంపై టెస్టు టీమ్ వైస్ కెప్టెన్ అజింక్య రహానే స్పందించాడు. ‘రేపటి మ్యాచ్‌లో అశ్విన్, జడేజాల్లో ఎవరిని ఆడించాలా అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నాడు. ఇది చాలా కష్టమైన నిర్ణయమే, అయినా ఇద్దరిలో ఒకరికే అవకాశం ఇచ్చే పరిస్థితి ఉందని రహానే చెప్పాడు. పిచ్ పరిస్థితిని అంచనా వేసిన తర్వాతే తుది నిర్ణయానికి వస్తామని స్పష్టం చేశాడు. రేపటి మ్యాచ్ ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తున్నామని, అందుకు తగిన ప్రణాళికలు రచిస్తున్నామని వెల్లడించాడు.

ఇషాంత్ అనుమానమే..

కాలిమడమ గాయంతో బాధపడుతున్న సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ రేపటి మ్యాచ్‌లో ఆడేది అనుమానమే అని తెలుస్తోంది. ఈ ఏడాది జనవరిలో ఒక రంజీ మ్యాచ్ సందర్భంగా జంబూ కాలికి గాయమైంది. దీంతో టెస్టుసిరీస్‌కు ముందు సరిగా మ్యాచ్ ప్రాక్టీస్ కూడా చేయలేకపోయాడు. అయితే, ఇప్పుడు ఆ గాయం మరింతగా బాధిస్తుండటంతో రెండుటెస్టు ఆడతాడో లేదో స్పష్టత లేదు. దీంతో జట్టు యాజమాన్యం ఉమేష్ యాదవ్‌ను తుది జట్టులోనికి తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. బుమ్రా కూడా మొదటి టెస్టులో పెద్దగా ప్రభావం చూపని సంగతి తెలిసిందే. దీంతో జట్టుకు మళ్లీ ‘పేస్ బౌలింగ్’ కష్టాలు మొదలవనున్నాయి.

తప్పక గెలవాల్సిందే..

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల టేబుల్‌లో 360 పాయింట్లతో టీమ్ ఇండియా అగ్రస్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా 296 పాయింట్లతో తర్వాతి స్థానంలో ఉంది. కాగా, టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌కు చేరాలంటే మాత్రం భారత జట్టు విదేశాల్లో మరోమ్యాచ్ తప్పకుండా గెలవాల్సి ఉంది. ఒక మ్యాచ్ రేపు కివీస్‌తో ప్రారంభం కానుండగా ఆ తర్వాత ఆస్ట్రేలియాతోనే విదేశీ పర్యటన ఉంది. దీంతో ఈ మ్యాచ్ ఎలాగైనా గెలిచి విదేశీ గడ్డపై విజయాన్ని నమోదు చేయాలని టీమ్ ఇండియా భావిస్తోంది. ఈ మ్యాచ్ గెలిస్తే భారత జట్టుకు 60 పాయింట్లు లభించనున్నాయి.

Advertisement

Next Story