మాన్సాస్ ట్రస్ట్‌పై కుట్ర.. అశోక్ గజపతిరాజు సంచలన వ్యాఖ్యలు

by srinivas |
మాన్సాస్ ట్రస్ట్‌పై కుట్ర.. అశోక్ గజపతిరాజు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ పెద్దలకు జ్ఞానం ప్రసాదించాలని పైడితల్లి అమ్మవారిని వేడుకున్నట్లు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అశోక్‌ గజపతిరాజు అన్నారు. మాన్సాస్‌ ట్రస్టు, సింహాచలం దేవస్థానం ఛైర్‌పర్సన్‌గా సంచైత నియామకం చెల్లదంటూ హైకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం విజయనగరంలోని పైడితల్లి అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం అశోక్‌ గజపతిరాజు మీడియాతో మాట్లాడారు. ఈ రెండేళ్లలో ప్రభుత్వం తనపై కక్షగట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. అంతేకాదు ఎన్నో అలజడులు కూడా సృష్టించారని చెప్పుకొచ్చారు.

ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం దేవస్థానంలోని గోశాలలో గోవులను హింసించి చంపేశారని.. అలాగే మాన్సాస్‌ సంస్థను అనేక రకాలుగా నష్టపరిచారని ఆరోపించారు. టస్ట్‌పై కొందరు కుట్ర చేశారని ధ్వజమెత్తారు. ట్రస్టు ఆధ్వర్యంలోని 105 ఆలయాల్లో ఏమేం జరిగాయో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. పైడితల్లి, రామతీర్థం, సింహాచలం ఆలయాల ఆదాయంలో 17 శాతం పరిపాలన, నిర్వహణ, సంరక్షణ కోసం దేవాదాయ శాఖకు వెళ్తుందని, ఇది ఏ మేరకు అమలు చేశారో పరిశీలించాల్సి ఉందని పేర్కొన్నారు. ఏదీ ఏమైనప్పటికీ చట్టాలు ఉన్నాయని, రాజ్యాంగం ఉందని మరోసారి రుజువైందని అశోక్ గజపతిరాజు అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story