‘ఆరెపల్లి’ కనిపించలేదా కలెక్టర్ సారు.. సెక్యూరిటీగా మారిన సర్పంచ్ అసహనం

by Shyam |
Arepalli Sarpanch Mallesh, Collector
X

దిశ, నిజామాబాద్ రూరల్: గ్రామ పంచాయతీలో నిధుల్లేక పారిశుధ్య కార్మికులకు జీతాలు ఇవ్వలేక నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ఆరేపల్లి గ్రామ సర్పంచ్ ఇరుసు మల్లేష్ సెక్యూరిటీ మారి సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఉదయం గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, రాత్రి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీగా విధులు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే, రెండ్రోజుల క్రితం ఆరేపల్లి గ్రామానికి సుమారు అర కిలోమీటర్ దూరంలో ఉన్న కంజర గ్రామాన్ని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి సందర్శించి గ్రామంలో ఎవెన్యూ ప్లాంటేషన్, క్రిమటోరియం, డంపింగ్ యార్డు, రైతు వేదిక, పల్లెప్రకృతి వనాన్ని సందర్శించారు. కానీ, గ్రామ పంచాయతీలో నిధులులేక సర్పంచ్ సెక్యూరిటీగా మారి రాష్ట్రంలో సంచలనంగా మారిన గ్రామాన్ని మాత్రం కలెక్టర్ సందర్శించలేదు. ఆరెపెల్లి గ్రామాన్ని సందర్శించక పోవడంలో ఆంతర్యమేమిటి అని జిల్లా వాసులు సైతం ఆశ్చర్యానికి లోనవుతున్నారు.

గత శనివారం జిల్లా పంచాయతీ అధికారి జయసుధ ఆరెపెల్లి గ్రామపంచాయతీలో మూడు లక్షల వరకు నిధులు నిల్వ ఉన్నాయని సర్క్యులర్లో పేర్కొన్నారు. సర్క్యూలర్‌లో ఉన్నది వాస్తవం అయితే ఆరపెల్లి గ్రామాన్ని కూడా జిల్లా కలెక్టర్ సందర్శించాల్సి ఉండాల్సిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. జిల్లా కలెక్టర్ ఆరెపల్లి గ్రామానికి వస్తే గ్రామపంచాయతీల్లో నిధుల్లేవని, గ్రామస్తులంతా ఏకమై ప్రశ్నిస్తారని చెప్పి కలెక్టర్ గ్రామానికి రాకుండా వెనుదిరిగి పోయారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. అదేవిధంగా ఆరెపల్లి గ్రామానికి కూతవేటు దూరంలో ఉన్న సదరు గ్రామ రైతు వేదికను సందర్శించిన కలెక్టర్ ఆరెపల్లికి రాకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. దీంతో సర్పంచ్ ఇరుసు మల్లేష్‌తో పాటు, వార్డు సభ్యులు గ్రామస్తులు గ్రామానికి అధికారులు రాకపోవటంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

గ్రామంలో నిధులుంటే కలెక్టర్ ఎందుకు సందర్శించలేకపోయారు? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. జిల్లా పంచాయతీ అధికారి ఆరెపల్లి గ్రామ పంచాయతీలో నిధులు ఉన్నాయని కాకి లెక్కలు చూపించి, ప్రజాప్రతినిధుల మెప్పు పొందడానికి ప్రయత్నం చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామ పంచాయతీలో నిధులు లేవని గత నాలుగు రోజుల క్రితమే సర్పంచ్ మల్లేష్ కుండబద్దలు కొట్టేశారు. దీంతో అధికారులు సైతం తాము గ్రామపంచాయితీలో నిధులు ఉన్నాయని పేర్కొనడం ఎంతవరకు సమంజసమని సమాలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్బంగా ఆరేపల్లి గ్రామ సర్పంచ్ ఇరుసు మల్లేష్ మాట్లాడుతూ.. తనకు అధికారులు ఫోన్‌ల ద్వారా బెదిరింపులకు గురిచేస్తున్నారని అన్నారు. మన గ్రామ పంచాయతీల్లో నిధులు లేకనే కలెక్టర్ పక్క గ్రామానికి వచ్చి తమ గ్రామానికి రాలేదని దీంతో గ్రామ పంచాయతీల్లో నిధుల్లేవని తేటతెల్లమైందని ఆరెపల్లి గ్రామస్తులు పంచాయతీ పాలకవర్గ సిబ్బంది, సర్పంచ్ తెగేసి చెప్పేశారు.

Advertisement

Next Story

Most Viewed