రైళ్లు సరే.. ఏపీలో బస్సులు కూడా బంద్

by Shyam |

దేశవ్యాప్తంగా ఏప్రిల్ 30వ తేదీ వరకు రైళ్లను నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అలాంటి ప్రకటనే చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచేందుకు రంగం సిద్ధం చేసిన ఏపీఎస్ ఆర్టీసీ బస్సులను నడపకూడదని, మరోసారి సమీక్షించిన తరువాతే వాటిని నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది.

వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌లో ఏపీఎస్ ఆర్టీసీ బస్సులను ఈ నెల 14వ తేదీతో లాక్‌డౌన్ పీరియడ్ ముగియగానే నడిపించాలని అధికారులు భావించారు. ఈ నేపథ్యంలోనే 15వ తేదీ బుధవారం నుంచి ఆర్టీసీ బస్సులను నడిపించాలన్న ఆలోచనతో ముందస్తు రిజర్వేషన్లను ఏపీఎస్ ఆర్టీసీ ప్రారంభించింది. దీంతో భారీ సంఖ్యలో టికెట్లు బుక్కయ్యాయి. ఏసీ బస్సులు మినహా, మిగతా సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఎక్స్ ప్రెస్ సర్వీసులకు రిజర్వేషన్లు ప్రారంభమైన సంగతి తెలిసిందే. హైదరాబాద్, బెంగళూరు విశాఖపట్నం, విజయవాడ తదితర ప్రాంతాల్లో లాక్ డౌన్ కారణంగా చిక్కుకుపోయిన వారంతా, తమ తమ స్వస్థలాలకు చేరుకునేందుకు పెద్దఎత్తున రిజర్వేషన్లు చేయించుకున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణీకులు మొగ్గు చూపారు. ఇంతలో వివిధ శాఖల అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్ ఎత్తేస్తే ముప్పు పెరుగుతుందన్న ఆలోచనలు వినిపించడంతో లాక్‌డౌన్ పొడిగించేందుకు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు బుక్ చేసిన టికెట్లను రద్దు చేసినట్టు ఏపీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. కరోనా వ్యాప్తి నియంత్రణలోకి రాకపోవడం, లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశాలున్న నేపథ్యంలోనే రిజర్వేషన్లను నిలిపివేసినట్టు ప్రయాణీకులు తెలుపుతూ అసౌకర్యానికి చింతిస్తున్నట్టు తెలిపింది. అయితే ఇప్పటికే ఆన్‌లైన్‌లో రిజర్వేషన్ చేయించుకున్న వారికి నగదును తిరిగి వారి బ్యాంకు ఖాతాకు వేయనున్నామని స్పష్టం చేసింది. తదుపరి ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చిన తరువాత మాత్రమే, తిరిగి రిజర్వేషన్ల సదుపాయం కల్పిస్తామని స్పష్టం చేసింది.

Tags: apsrtc, rtc buses, corona, lock down, bus reservation

Advertisement

Next Story

Most Viewed