అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా

by  |
అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా
X

దిశ, న్యూస్‌బ్యూరో: కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంపై రెండు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి ఈనెల 25న నిర్వహించాల్సిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా పడింది. అధికారికంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అధికారికంగా సమాచారం పంపింది. ఏపీ రాయలసీమ ఎత్తపోతల పథకంపై తెలంగాణ ఫిర్యాదు చేయడంతో ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు నెలకొన్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ముందుగా ఈనెల 5న అపెక్స్ ఏర్పాటు చేసింది. అయితే ఇరురాష్ట్రాల సీఎంలు సమయం ఇవ్వకపోవడంతో వాయిదా వేశారు. సీఎంలు కోరిన విధంగా ఈనెల 25న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే కేంద్రమంత్రి షెకావత్‌కు కొవిడ్ నిర్థారణ కావడంతో సమావేశాన్ని వాయిదా వేయడం అనివార్యంగా మారిందని జలశక్తి మంత్రిత్వ శాఖ లేఖలో పేర్కొంది. సెప్టెంబర్‌లో సమావేశం జరిగే అవకాశాలున్నాయని నీటిపారుదల శాఖ వర్గాలు భావిస్తున్నాయి.

అది సంగమేశ్వరం ఎత్తిపోతలు

మరోవైపు రాయలసీమ ఎత్తపోతల పనులను చేపట్టేందుకు ఎన్జీటీ నుంచి అనుమతి తీసుకునేందుకు ఏపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. బచాబత్ ట్రిబ్యునల్‌లో ఉన్నట్టే కొత్త ప్రాజెక్టులు చేపట్టడం లేదని, సంగమేశ్వరం దగ్గర పాత ప్రాజెక్టు కింద నిర్మిస్తున్నట్లు ఆఫిడవిట్ దాఖలు చేస్తోంది. రాయలసీమ ఎత్తిపోతలకు ఏపీ టెండర్లు ఖరారు చేసింది. మేఘా కంపెనీకి టెండర్లు అప్పగించింది. అయితే ఎన్జీటీ గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం కేవలం టెండర్లు, సాంకేతిక పనులకు మాత్రమే అనుమతి ఉంది. టెండర్లు ముగిసిన తర్వాత పనులు చేసేందుకు అనుమతి లేదు. కానీ ఏపీ ఇప్పుడు పనులు మొదలుపెట్టేందుకు అనుమతి తీసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. దీనిపై ఏపీ జలవనరుల శాఖ నివేదికలు సిద్ధం చేసింది. అయితే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఎన్జీటీలో అఫిడవిట్ దాఖలు చేయడంతో కేసును రీ ఓపెన్ చేశారు.

దీనిపై ఏపీ సీఎం జగన్.. జలవనరుల శాఖ ఇంజనీర్లు, న్యాయవాదులతో ఆదివారం సమీక్షించారు. తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌పై వాదనలు వినిపిస్తూనే సంగమేశ్వరం పాయింట్‌గా పాత ప్రాజెక్టు నిర్మిస్తున్నట్లు వాదించాలని, సంగమేశ్వరం సాకుగా అనుమతి తీసుకోవాలని సూచించారు. దీనికోసం పాత జీవోలు, అప్పటి వివరాలన్నీ ఎన్జీటీకి సమర్పించాలని ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం అపెక్స్ కౌన్సిల్ సమావేశం కూడా లేకపోవడంతో వీలైనంత త్వరగా రాయలసీమ పనులు మొదలుపెట్టే విధంగా చర్యలు చేపట్టాలని సూచించినట్లు తెలుస్తోంది.


Next Story

Most Viewed