ఏపీVS తెలంగాణ.. లేఖలతో మళ్లీ ముదురుతున్న వివాదం

by srinivas |
ఏపీVS తెలంగాణ.. లేఖలతో మళ్లీ ముదురుతున్న వివాదం
X

దిశ, తెలంగాణ బ్యూరో : కృష్ణా, గోదావరి బోర్డులు, తెలంగాణ, ఏపీ ప్రభుత్వం మధ్య మళ్లీ లేఖల యుద్ధం మొదలైంది. బోర్డుల సమావేశానికి రామంటూ తెలంగాణ తేల్చి చెప్పుతోంది. మరోవైపు ఏపీ ప్రభుత్వం సీడబ్ల్యూసీ చీఫ్​ఇంజినీర్​పై ఆరోపణలు చేయడంతో తెలంగాణ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, ఈ నెల 3న కేఆర్‌ఎంబీ, ఆర్ఎంబీల సంయుక్త సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్నీ తెలంగాణ అధికారులు బహిష్కరించారు. పూర్తిస్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని ఇరు బోర్డులకు, కేంద్రానికి తెలంగాణ సర్కార్ లేఖ రాసింది.

తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖపై స్పందిస్తూ ఈనెల 9న కృష్ణ, గోదావరి బోర్డులు అత్యవసర పూర్తిస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. న్యాయ స్థానాల్లో ప్రాజెక్టులకు సంబంధించిన పలు కీలక కేసుల విచారణ దశలో ఉన్నందున బోర్డు నిర్వహించే అత్యవసర సమావేశానికి హాజరు కాలేమని తెలంగాణ తేల్చి చెప్పింది.

9న మీటింగ్​ ఉందంటూ లేఖ

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఆయా బోర్డులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ నెల 9న రెండు బోర్డులూ ఉమ్మడి సమావేశం నిర్వహిస్తున్నట్లు రెండు రాష్ట్రాలకు కేఆర్ఎంబీ సమాచారమిచ్చింది. హైదరాబాద్​లోని జలసౌధలో ఈ సమావేశం నిర్వహిస్తున్నామని, గెజిట్‌లోని అంశాల అమలు కార్యాచరణపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు.

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని నిర్ణయించిన కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ, జులై 15న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. దీన్ని ఏపీ స్వాగతించగా, తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే గత నెల 28న కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి రెండు బోర్డుల చైర్మన్లకు లేఖ రాశారు. గెజిట్ నోటిఫికేషన్లోని అంశాలు నిర్ణయించిన గడువులోగా అమలయ్యేలా తేదీల వారీగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేసి పంపాలని సూచించారు. దీని కోసం 11 మందితో సమన్వయ కమిటీని గోదావరి నదీ యాజమాన్యబోర్డు ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ఈఎన్సీలు, పరిపాలనా విభాగం ఈఎన్సీలు, ట్రాన్స్​కో, జెన్​కో అధికారులున్నారు. తొలి మీటింగ్​ను మంగళవారం నిర్వహించింది. కానీ తెలంగాణ మాత్రం రామంటూ చెప్పింది.

మరోవైపు గోదావరి బోర్డు అధికారుల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్న దశలోనే కృష్ణా నదీ యాజమాన్య బోర్డు 12 మందితో సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తూ సోమవారం నిర్ణయం తీసుకుని మంగళవారం సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు రెండు రాష్ట్రాలకు లేఖలు రాసింది. మొదట పూర్తిస్థాయి బోర్డు సమావేశాన్ని నిర్వహించాలని కోరిన తెలంగాణ సమన్వయ కమిటీ సమావేశానికి హాజరు కాలేదు. మరోవైపు ఏపీ కూడా గెజిట్​లో కొన్ని సవరణలు చేయాల్సి ఉందని, అవి జరిగాక ముందడుగు వేద్దామని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 9న బోర్డు ఉమ్మడి సమావేశం నిర్వహించాలని నిర్ణయించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మాకు కోర్టు కేసులున్నాయి.. రాలేం

గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ), కృష్ణా బోర్డు ఛైర్మన్‌కు తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్ లేఖ రాశారు. ఈ నెల 9న బోర్డు భేటీకి హాజరుకావట్లేదని లేఖలో స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు, ఎన్జీటీలో విచారణ ఉన్నందున భేటీకి రాలేమని వివరించారు. బోర్డు భేటీకి మరో తేదీ ఖరారు చేయాలని కోరారు. వీలైనంత త్వరగా బోర్డును సమావేశపర్చాలని పేర్కొన్నారు.

మళ్లీ వాయిదా

జీఆర్​ఎంబీ, కేఆర్​ఎంబీ ఉమ్మడి సమావేశాన్ని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రెండు రాష్ట్రాలకు బోర్డుల నుంచి సమాచారమిచ్చారు. తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చి విజ్ఞప్తితో వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. సమావేశాన్ని త్వరలోనే నిర్వహిస్తామని, రెండు రాష్ట్రాలకు సమాచారమిస్తామని తెలిపారు.

పరిశీలన బృందంలో తెలంగాణ అధికారా..?

రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను తనిఖీ చేయనున్న బృందంలో తెలంగాణకు చెందిన అధికారిని ఎలా నియమిస్తారని ఏపీ ప్రభుత్వం జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ)లో అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటుగా కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. తనిఖీ బృందంలో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నుంచి నియమితులైన వ్యక్తి తెలంగాణకు చెందిన వారు కావడంపై ఏపీ తీవ్ర అభ్యంతరం చెప్పుతోంది. బోర్డుకు రాసిన లేఖలో కూడా ఇదే అంశాన్ని ఎత్తి చూపించింది. తెలంగాణకు చెందిన దేవేందర్​రావును పరిశీలన కమిటీ నుంచి తొలిగించాలని పేర్కొంది.

ఏపీపై ఫైర్​

కృష్ణా బోర్డుకు తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్ ఘాటు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం పరిశీలన బృందంలో సీడబ్ల్యూసీ సభ్యుడు దేవేందర్​రావు ఉండటంపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం తెలుపడంతో స్పందించిన తెలంగాణ ప్రభుత్వం గురువారం సుదీర్ఘమైన లేఖను పంపింది. గతంలో సీడబ్ల్యూసీ సభ్యులపై తాము అభ్యంతరం చెప్పలేదని, సీడబ్ల్యూసీ సభ్యుడిపై ఏపీ అభ్యంతరం చెప్పడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాజెక్టుల పరిశీలన బృందంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన కె.శ్రీనివాస్ ఉన్నారని, గతంలో కె.శ్రీనివాస్ పై తెలంగాణ తరుపున ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని, సీడబ్ల్యూసీ అధికారికి ప్రాంతాలు ఆపాదించడం అనైతికమంటూ మండిపడ్డారు. ఎన్డీటీ ఆదేశాలను ఆలస్యం చేయడమే ఏపీ ఉద్దేశమని, ఎన్డీటీ ఆదేశాల మేరకు రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను కేఆర్ఎంబీ పరిశీలించాలంటూ లేఖలో సూచించారు. రాయలసీమ ఎత్తిపోతల పనుల పరిశీలనపై ఈనెల 9 లోగా నివేదిక ఇవ్వాలని ఈఎన్‌సీ మురళీధర్ కృష్ణాబోర్డుకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed