ఆర్టీసీ బస్సుల పునరుద్ధరణపై ప్రతిష్ఠంభన

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో బస్సు సర్వీసుల పునరుద్ధరణపై ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్‌ బస్‌భవన్‌లో సమావేశమైన ఏపీ, తెలంగాణ ఆర్టీసీ అధికారులు అంతర్ రాష్ర్ట బస్సు సర్వీసుల పునరుద్దరణ, కిలోమీటర్లు, ఏ రూట్లలో ఎన్ని బస్సులు నడపాలనే అంశంపై చర్చలు జరిపారు.

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో 2.65లక్షల కిలోమీటర్లకు బస్సులు తిరుగుతున్నాయని, 71 రూట్లలో ఏపీ, 28రూట్లలో తెలంగాణ బస్సులు నడుస్తున్నాయని రెండు రాష్ట్రాల మధ్య 1.1లక్షల కిలోమీటర్ల గ్యాప్ ఉందని ఏపీ ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు అన్నారు. 50వేల కి.మీ తగ్గిస్తాం.. మీరు పెంచండని కోరితే 1.1లక్షల కి.మీ నుంచి 1.6లక్షల కిలో మీటర్లు పెంచేందుకు తెలంగాణ ముందుకు వచ్చిందని అంతకుమించి పెంచే సామర్థ్యం లేదని చెబుతున్నారన్నారు. అంతరాష్ట్ర బస్సులు నడిపేందుకు ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి అనుమతి ఉందని, అయితే ఇతర రాష్ట్రాల నుంచి రూట్ల వారీగా స్పష్టత ఇవ్వాలని తెలంగాణ కోరిందని, కానీ ఇప్పటివరకు ఏ రాష్ట్రం ఇలాంటి ప్రతిపాదన చేయలేదని తెలిపారు. సర్వీసుల పునరుద్ధరణపై ప్రతిష్ఠంభన ఇలాగే ఉంటే ప్రైవేట్ వారికి లాభం ఉంటుందని తెలంగాణ అధికారులకు సూచనలు చేసినట్లు కృష్ణబాబు తెలిపారు. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ మాట్లాడుతూ రూట్ల వారీగా రెండు రాష్ట్రాలు సమానంగా బస్సులను నడపాలని ప్రతిపాదించామని, అయితే దీనిపై స్పష్టత వస్తేనే ముందుకు వెళ్తామని ఆయన పేర్కొన్నారు.

Advertisement