- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ పిటిషన్ విత్‌డ్రాకు అనుమతి ఇవ్వొద్దు.. సుప్రీంను కోరిన ఏపీ, కర్ణాటక
దిశ, తెలంగాణ బ్యూరో: కృష్ణా జలాల పంపకాలపై ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలంటూ 2015లో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకునే ప్రక్రియకు చిక్కులు ఏర్పడ్డాయి. గతేడాది అక్టోబరులో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర జలశక్తి మంత్రి చేసిన ప్రతిపాదన మేరకు పిటిషన్‌ను ఉపసంహరించుకోడానికి తెలంగాణ సిద్ధపడింది. ఆ మేరకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్నది. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికీ లిఖితపూర్వకంగా తెలియజేసింది. అయితే, ఆ దరఖాస్తుపై శుక్రవారం ఛాంబర్ జడ్జి జస్టిస్ అనిరుధ్ బోస్ సమక్షంలో విచారణకు రాగా తెలంగాణ తరపు న్యాయవాది తన అభిప్రాయాన్ని తెలియజేశారు. కానీ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలు మాత్రం పిటిషన్‌ను తెలంగాణ ఉపసంహరించుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్‌ను బదిలీ చేస్తున్నట్లు జస్టిస్ అనిరుధ్ బోస్ స్పష్టం చేశారు.
సుప్రీంకోర్టు విచారణ ద్వారానే సమస్యకు పరిష్కారం కోరుకుంటున్నట్లు ఏపీ, కర్నాటక తరఫు న్యాయవాదులు జస్టిస్ అనిరుధ్ బోస్‌కు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం పిటిషన్‌ను ఉపసంహరించుకోడానికి అనుమతి ఇవ్వవద్దని పట్టుబట్టాయి. సమైక్య రాష్ట్రం విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం 2015లో కృష్ణా జలాల్లో జరుగుతున్న అన్యాయాన్ని పేర్కొంటూ న్యాయమైన వాటాను నిర్ధారించడానికి కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని కోరింది. అప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2014లో ఇదే అంశంతో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ పిటిషన్‌పై కొంతకాలం విచారణ కూడా జరిగింది. దానికి హాజరైన కర్నాటక ప్రభుత్వం, కృష్ణా జలాల వివాదం కొత్తగా ఉనికిలోకి వచ్చిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన వివాదం మాత్రమేనని, కొత్తగా తలెత్తినది కాదని, కర్నాటకకు ఎలాంటి సంబంధం లేదని వాదించింది.
తెలంగాణ నీటి హక్కులు కూడా ఇందులో ముడిపడి ఉన్నందున తమ వాదనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలంటూ 2015లో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నది. రాష్ట్రాల అవసరాలకు, ఆయకట్టు తదితరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని రాష్ట్రాలకు నీటి కేటాయింపులు నిర్ణయించాలని పేర్కొన్నది. ఇదే అంశంపై ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనల మేరకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అవసరాలకు అపెక్స్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసింది. గతేడాది అక్టోబరులో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జల వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, అందుకోసం సుప్రీంకోర్టులో ఉన్న పిటిషన్‌ను ఉపసంహరించుకోవాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.
సుప్రీంకోర్టులో పిటిషన్ ఉండగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం సమంజసం కాదని, లీగల్ చిక్కులు ఉంటాయని, సబ్ జ్యుడిషియల్ అంశమని కేసీఆర్‌కు వివరించారు. దీనికి సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్ ఆ మేరకు సుప్రీంకోర్టుకు దరఖాస్తు చేసుకుని 2015 నాటి రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకోనున్నట్లు తెలిపారు. దరఖాస్తు చేసిన విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి లిఖితపూర్వకంగానే తెలియజేశారు. కానీ, చివరకు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ ఉపసంహరణకు సంబంధించిన దరఖాస్తు వ్యవహారం చిక్కుల్లో పడింది. కర్నాటక, ఏపీ వ్యతిరేకించడంతో ధర్మాసనం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.