ఏపీలో ఐసెట్, ఏపీఈసెట్ పరీక్షా ఫలితాలు విడుదల

by srinivas |   ( Updated:2021-10-01 02:49:54.0  )
ఏపీలో ఐసెట్, ఏపీఈసెట్ పరీక్షా ఫలితాలు విడుదల
X

దిశ, ఏపీ బ్యూరో: ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశానికి సంబంధించిన ఏపీ ఐసెట్‌–2021, ఏపీ ఈసెట్‌ 2021 పరీక్షా ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి. మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఉదయం 11గంటలకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఐసెట్‌ ఫలితాల్లో 34,789(91.27శాతం) మంది ఉత్తీర్ణత సాధించగా ఈసెట్‌ ఫలితాల్లో 29,904 (92.53శాతం) మంది ఉత్తీర్ణులైనట్లు మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. ఈ పరీక్షా ఫలితాల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన రామకృష్ణ మెుదటి ర్యాంకు సాధించగా అనంతపురం జిల్లాకు చెందిన బండి లోకేశ్‌రెండో ర్యాంకు సాధించారు. అలాగే విజయనగరంకు చెందిన వెంకటేశ్‌కు మూడో ర్యాంక్, చిత్తూరు జిల్లాకు చెందిన అల్లి లిఖిత్‌కు నాలుగో ర్యాంక్, షేక్ అమియుల్లాకు ఐదో ర్యాంక్, సాయి మణికుమార్ చెన్నంకు ఆరో ర్యాంకు సాధించినట్లు మంత్రి సురేశ్ ప్రకటించారు. చిత్తూరు జిల్లాకు చెందిన నలుగురు విద్యార్థులకు టాప్-10లో నాలుగు ర్యాంకులు వచ్చినట్లు మంత్రి వెల్లడించారు.

ఈ సందర్భంగా ఐసెట్ కీని కూడా విడుదల చేసినట్లు మంత్రి సురేశ్ ప్రకటించారు. ఈ ఏపీ ఐసెట్ పరీక్షలను సెప్టెంబర్‌ 17, 18 తేదీల్లో ఆంధ్రా యూనివర్సిటీ నిర్వహించిన సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేనివిధంగా పరీక్ష నిర్వహించిన రెండు వారాల్లోపే ఫలితాలను విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. ఇటీవలే ఎంసెట్ పరీక్షల ఫలితాలు కూడా అంతే వేగంతో ఇచ్చినట్లు మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. ఏపీ ఐసెట్ ఫలితాలను www.sche.ap.gov.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని మంత్రి సూచించారు. శనివారం నుంచి మార్క్స్ మెమోను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఇకపోతే త్వరలోనే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు.

ఏపీఈసెట్ ఫలితాలు విడుదల

మరోవైపు ఇంజనీరింగ్‌ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ విధానంలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన ఏపీఈసెట్‌–2021ఫలితాలను కూడా మంత్రి ఆదిమూలపు సురేశ్ ఫలితాలు విడుదల చేశారు. ఈ పరీక్షలను జేఎన్‌టీయూ నిర్వహించింది. ఈ ఏపీఈసెట్‌కు సంబంధించి 13 విభాగాలకు పరీక్షలు నిర్వహించగా మొత్తం 32,318 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 29,904( 92.53 శాతం ) మంది ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి తెలిపారు. అయితే గతేడాదితో పోలిస్తే ఉత్తీర్ణతాశాతం నాలుగు శాతం తగ్గిందని మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. ఈ ఫలితాల వెల్లడి కార్యక్రమంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి, తెలుగు సంస్కృత అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed