నిండుకుండలా జలాశయాలు

by  |
నిండుకుండలా జలాశయాలు
X

దిశ, ఏపీ బ్యూరో: కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద పోటెత్తుతోంది. పులిచింతలకు ఎగువ నుంచి భారీగా వరద చేరుతుండటంతో 17 గేట్లు ఎత్తారు. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం జడపల్లితండాను పులిచింతల నీరు చుట్టేయడంతో మాదిపాడు – జడపల్లితండాకు రాకపోకలు నిలిచియాయి. దాచేపల్లి మండలం రామాపురం చేపలకాలనీలోకి నీరు చేరడంతో అప్రమత్తమైన అధికారులు పడవల సాయంతో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. పోటేళ్లవాగు, ఓగేరు, పెరమవాగు, మొద్దువాగులు, కొండవీటి వాగులు పొంగిపొర్లాయి. ప్రస్తుతం బ్యారేజ్ ఇన్ ఫ్లో 3,52,579 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 3,43,690 క్యూసెక్కులుగా ఉంది.

ప్రకాశంజిల్లాలో 14మండలాల్లో కుండపోత వర్షం కురిసింది. గుండ్లకమ్మ వాగులో ట్రాక్టర్‌ కొట్టుకుపోయింది. వాగులో చిక్కుకున్న ఇద్దరిని గజ ఈతగాళ్లు ఒడ్డుకు చేర్చారు. కొత్తకోట వాగు ఉధృతిలో చిక్కుకున్న హర్యానాకు చెందిన లారీ డ్రైవర్, క్లీనర్‌లను పోలీసులు ఒడ్డుకు చేర్చారు. తూర్పు వాగులో చిన అంబడిపూడి బీసీకాలనీకి చెందిన పల్లపు శ్రావణ్‌కుమార్‌ (11), గుంజి విశాల్‌ అనే విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోయారు. గాలించి ఇరువురిని వైద్యశాలకు తరలించగా శ్రావణ్‌ మృతిచెందాడు. కర్నూలు జిల్లాలో ఓ వ్యక్తికి గుండెపోటు రాగా చుట్టూ వరద జలాల కారణంగా 108 వాహనం వెళ్లలేకపోయింది. సకాలంలో వైద్య సాయం అందక చనిపోయాడు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలోని తంగేళిమిట్ట వద్ద మద్దెలవంకలో సుమంత్‌ (14) అనే విద్యార్థి వాగులో కొట్టుకుపోయాడు. తనతో పాటు వాగులో జారిన ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు.

అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిల్​కుమార్​

కృష్ణా నదికి భారీగా వరద నీరు పోటెత్తడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ సూచించారు. రాత్రికి ప్రకాశం బ్యారేజీకి వరద 6లక్షల క్యూసెక్కులు వచ్చే అవకాశం ఉండటంతో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఇరిగేషన్ సీఈలతో మంత్రి అనిల్‌ ఫోన్‌లో మాట్లాడారు.


Next Story

Most Viewed