అమరావతి కూడా రాజధానే: జగన్

by srinivas |   ( Updated:2020-02-11 04:09:11.0  )
అమరావతి కూడా రాజధానే: జగన్
X

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు కియాపై మౌనం వీడారు. కియా రాష్ట్రాన్ని వీడడం లేదని ప్రకటించారు. రాయిటర్స్ కథనం చంద్రబాబు చాతుర్యమేనని స్పష్టం చేశారు. రాజకీయాల్లో దిగజారుడుతనానికి నిదర్శనమే రాయిటర్స్ కథనమని జగన్ తెలిపారు.

మూడు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో 1.1 బిలియన్ పెట్టుబడితో నెలకొల్పిన కియా కార్ల కంపెనీ తమిళనాడుకు తరలిపోతోందంటూ రాయిటర్స్ పత్రిక ట్వీట్ చేసి, ఒక కథనాన్ని ప్రచురించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత రాజకీయ పరిణామాలను పేర్కొంటూ.. కంపెనీ తరలిపోతోందని వెల్లడించింది. ఈ కథనం ఆంధ్రప్రదేశ్‌లో అలజడి రేపింది. విపక్షాలకు ఆయుధం దొరికినట్టైంది. సీఎం జగన్ అసమర్థతను అంతర్జాతీయ మీడియా గుర్తించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రాన్ని తిరోగమన దిశలో నడిపిస్తున్నారంటూ విపక్షాలు మండిపడ్డాయి. ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి మరీ ఆందోళన వ్యక్తం చేశాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం డిఫెన్స్‌లో పడింది. వైఎస్సార్సీపీ నేతలు మౌనం వహించారు.

మంత్రుల ఆదేశాలతో అధికారులు కియా కంపెనీతో టచ్‌లోకి వెళ్లారు. కథనంలో విశ్వసనీయతను ప్రశ్నించారు. అదే సమయంలో తమిళనాడు ప్రభుత్వ వర్గాల్లో కూడా ఆరాతీశారు. దీంతో కియా కథనం వాస్తవం కాదని నిర్ణయించుకున్నారు. పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి మీడియాకు స్పష్టమైన ప్రకటన జారీ చేశారు. కియాకు అలాంటి ఆలోచిన లేదని తేల్చిచెప్పారు. అదే సమయంలో కియా కూడా అదే ప్రకటన చేసింది. ప్రస్తుతం ఉత్పత్తిపైనే తమ దృష్టి ఉందని, ప్లాంట్ తరలింపు గురించి ఎలాంటి ఆలోచన లేదని స్పష్టం చేసింది.

అయినప్పటికీ ప్రతిపక్షాల ఆరోపణలకు అడ్డుకట్ట పడడం లేదు. దీంతో సీఎం జగన్ రంగప్రవేశం చేసి విపక్షాల ఆరోపణలను ఖండించారు. ఖండిస్తూనే రాజధానిపై స్పష్టమైన ప్రకటన చేశారు. రాజకీయ లబ్ది కోసమే టీడీపీ అధినేత ఆ కథనాన్ని రాయించారని జగన్ అన్నారు. దిగజారుడు రాజకీయాలు బాబుకు కొత్తకాదని ఎద్దేవా చేశారు. కియా మోటార్స్ అనంతపురంలోనే ఉందని, ఉంటుందని స్పష్టం చేస్తూ, రాజకీయాల కోసం ప్లాంట్ ఎక్కడికీ తరలడం లేదన్న క్లారిటీని కియా మేనేజింగ్ డైరెక్టర్ ఇవ్వాల్సిన దుస్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు.

అమరావతి ఆందోళనపై మాట్లాడుతూ, లక్ష కోట్లు పెట్టి అమరావతిని అభివృద్ధి చేసేంత డబ్బు ప్రభుత్వం వద్ద లేదని స్పష్టం చేశారు. అమరావతిని అభివృద్ధి చేయడంలో వినియోగించే నిధుల్లో కేవలం పదో శాతం నిధులతో విశాఖపట్టణాన్ని అద్భుతంగా డెవలెప్ చేయొచ్చని స్పష్టం చేశారు. రానున్న పదేళ్లలో హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వంటి మెట్రోపాలిటన్ సిటీస్‌తో వైజాగ్ పోటీ పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

అమరావతి నుంచి రాజధానిని మార్చడం లేదని స్పష్టం చేసిన ఆయన.. అమరావతి ఆంధ్రప్రదేశ్ లెజిస్టేటివ్ క్యాపిటల్‌గా కొనసాగుతుందని ప్రకటించారు. దానిని మార్చే ఆలోచనేదీ తమ వద్ద లేదని ఆయన వెల్లడించారు. రాజధాని మారడం లేదని ఆయన తెలిపారు. ఏపీకి ప్రత్యేకహోదా ముగిసిపోయిన అధ్యాయం కాదని జగన్ అన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నామని చెప్పారు. కేంద్ర మాటలకు విరుద్ధంగా రాష్ట్ర బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story