ఏపీలో కార్పొరేట్‌ వ్యవసాయానికి అంతా సిద్ధం

by Anukaran |
ఏపీలో కార్పొరేట్‌ వ్యవసాయానికి అంతా సిద్ధం
X

దిశ, ఏపీ బ్యూరో: ‘‘ఏముందన్నా ! అంతా ఎకరా రెండెకరాలున్నోళ్లం. పెద్ద రైతు ఏసిన పంటే మేం కూడా వేయాలి. అంతకుమించి గత్యంతరం లేదు. వరి పంటేస్తే కూలీల బాధని చెప్పి వాళ్లు సుబాబులు ఏసేశారు. ఓ బర్రెను పెట్టుకొని కూటి గింజల కోసం వరి నారుమళ్లు పెట్టుకుందామంటే నీళ్లు లేకుండా స్కీములు ఆపేశారు. అలా మాబోటి చిన్నసన్నకారునంతా నాశనం చేశారు. ఆడెవడో కంపెనీ వోడు వత్తే వాళ్ల భూములన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మా పరిస్థితేంటో అర్థం కావడం లేదు’’ అంటూ ప్రకాశం జిల్లా నాగులుప్పపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామానికి చెందిన ఓ బక్క రైతు తన ఆవేదన వ్యక్తం చేశాడు.

నాగులుప్పపాడులో 4,700 ఎకరాల ఆయకట్టుంది. గతంలో సస్యశ్యామలంగా గుండ్ల కమ్మ నదీ ప్రవాహంలో ఎత్తిపోతల పథకాల కింద వరి పండేది. పదెకరాలకు పైనున్న మోతుబరులంతా తమ భూములకు కౌలు ధరలు పెంచుకునేందుకు చిన్నసన్నకారు రైతులను దెబ్బ తీశారు. ముందుగా సుబాబుల్, జామాయిల్​ తోటలు పెట్టారు. దాంతో మిగతా బక్క రైతులు ఆహార పంటలు సాగుచేయలేని దుస్థితికి తెచ్చారు. ఎత్తిపోతల పథకాలను తమ రాజకీయ ప్రాబల్యంతో అటకెక్కించారు. మెట్ట పంటలైతే తమకు మరింత ఎక్కువ కౌలు సొమ్ము వస్తుందనే పేరాశకు ఇది దారితీసింది.

ఇప్పుడు ఆ భూముల్లో పొగాకు, శెనగ, పత్తి పంటలు సాగవుతున్నాయి. మోతుబరుల బిడ్డలంతా సాఫ్ట్​వేర్ ​ఉద్యోగాలకు వెళ్లిపోయారు. వాళ్ల భూములకు అధిక కౌలు ధర రావడం కోసం ఇలాంటి దుర్మార్గానికి తెరదీశారు. దీంతో దాదాపు మూడు ఎత్తిపోతల పథకాలు గ్రామంలో పడకేశాయి. చిన్నసన్నకారు రైతుల భూముల్లో సామాజిక వనాల పెంపకం మొదలైంది. వాళ్ల కుటుంబాల్లో వ్యవసాయ అనుబంధంగా నడుపుకునే పాడి పరిశ్రమ కనుమరుగైంది. ఇప్పుడు ఆ గ్రామంలో సాఫ్ట్​వేర్ ​ఉద్యోగులు వర్క్ ​ఫ్రం హోం పేరుతో పడవల్లాంటి కార్లతో వచ్చి చేరారు. వాళ్ల భూములను కౌలుకు తీసుకున్న వ్యవసాయ కూలీలు, చిన్నసన్నకారు రైతులను తమ అధీనంలో పెట్టుకున్నారు. రాజకీయాలను శాసిస్తున్నారు. కార్పొరేట్​ వ్యవసాయానికి తమ భూములను ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు సంకేతాలిస్తున్నారు.

అధికారిక ప్రకటనే తరువాయి..

ఈ పాటికే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మేలు చేసే అనేక కార్యక్రమాలను ప్రారంభించింది. రైతు భరోసా కేంద్రాలు, వాటికి అనుబంధంగా పాల కేంద్రాలు, శీతల గిడ్డంగులు, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేస్తోంది. ఇక అంబానీలు, అదానీలు ప్రత్యేకంగా ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన పన్లేదు. నేరుగా వచ్చి రైతు భరోసా కేంద్రంలో తమకు కావాల్సిన పంటలను కొనుగోలు చేసి తీసుకెళ్లొచ్చు. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల ప్రకారం పరిమితి లేదు. ఎంతైనా కొనుక్కోవచ్చు. ఎంతకైనా కొనుగోలు చేయొచ్చు. ఎక్కడైనా నిల్వ ఉంచుకోవచ్చు.

రాష్ట్ర ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసి నిల్వ చేసుకునే కోల్డ్​ స్టోరేజీలను కూడా సిద్ధం చేస్తోంది. ఇప్పటికైతే కేవలం కొద్ది పంటలకే ప్రభుత్వ మద్దతు ధర నడుస్తోంది. కానీ గ్రామాల్లో పండించే అనేక రకాల వ్యవసాయ ఉత్పత్తులను తమ ఇష్టమొచ్చిన ధరకు కొనుక్కోవచ్చు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను వాడుకోవచ్చు. ఇందుకు అధికారిక ప్రకటన రావడమే ఆలస్యం. ఆనక రిటైల్ ​చైన్ ​దుకాణాల్లో పెట్టి పావలా సరుకును పాతిక రూపాయలకు అమ్ముకోవచ్చు. తేడా వస్తే ప్రభుత్వాల కుత్తుకలపై కత్తి పెట్టి తమ ప్రయోజనాలను కాపాడుకోవచ్చు. ఇవన్నీ తెలీని అమాయక చిన్నసన్నకారు రైతులు కులం, వర్గం, ప్రాంతం పేరుతో పెనుగులాడుతుంటారు. కౌలు రైతులు కనుమరుగవుతారు. మోతుబరుల బిడ్డలకు ఈ దోపిడీలో వాటా దక్కుతుంది.

కార్పొరేట్​ సాగుకు ప్రాతిపదిక సిద్ధమైంది: జుజ్జూరి జయంతిబాబు, రైతు సంఘం నేత

ఇక్కడ మోతుబరుల భూములు కార్పొరేట్ల ఒప్పందాల కోసం రంగం సిద్ధమైంది. తమ భూములను కౌలు పట్టి చేస్తున్న వాళ్లను అదే భూముల్లో కార్పొరేట్ల కింద కూలీలుగా మలిచేందుకు అన్ని ఏర్పాట్లూ చాపకింద నీరులా సాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో భూమి ఎవరి చేతిలో ఉంటే వాళ్లే రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులను శాసిస్తారు. రాష్ట్రంలో అధికారం కోసం పెనుగులాడే పార్టీలు ఓటు బ్యాంకులను తమ అధీనంలో పెట్టుకోవచ్చు. కార్పొరేట్​సాగుతో తమ తాబేదారులు ఆర్థిక ప్రయోజనాలను పొందొచ్చు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు ఖతం. రానున్న రోజుల్లో గ్రామీణ అసమానతలు పెరిగి ఏ రూపం తీసుకుంటాయో చూడాల్సి ఉంది.

Advertisement

Next Story