టీడీపీకి జగన్ సంధించిన సూటి ప్రశ్నలివే!

by srinivas |
టీడీపీకి జగన్ సంధించిన సూటి ప్రశ్నలివే!
X

దిశ ఏపీ బ్యూరో: టీడీపీపై ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. ఇంగ్లిష్ మీడియంపై టీడీపీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని మండిపడ్డారు. పలు సూటి ప్రశ్నలు సంధించారు. ‘మీ పిల్లలు, మనవళ్లు ప్రైవేటు స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియంలో విద్యనందుకోవాలా? పేదల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం తెలుగు మీడియంలోనే చదవాలా? ఇంగ్లిష్ మీడియంలో చదువుతామంటే.. తెలుగు నాశనమైపోతుందా? ఇదేం నీతి? విలువలు లేవా? మీకోనీతి పేదలకోనీతా?’ అని సూటిగా నిలదీశారు. నాడు నేడు, ఇంగ్లిష్ మీడియం విద్య, అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన పథకాలపై పెడుతున్న ఖర్చు మన పిల్లల భవిష్యత్‌ కోసం తాను పెడుతున్న పెట్టుబడి అని ఆయన అన్నారు.

అమరావతి రీజియన్‌లోని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ‘మన పాలన-మీ సూచన’ మేథోమధన సదస్సు మూడవ రోజు సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన పాదయాత్రలో విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నానని గతాన్ని గుర్తు చేసుకున్నారు. విద్యార్థులకు నవంబర్‌ నాటికి కూడా పుస్తకాలు అందని దుస్థితి, స్కూల్‌ బిల్డింగ్‌లు అధ్వానంగా ఉన్న పరిస్థితి, స్కూల్ ఉన్నప్పటికీ దానిని ఎవరూ పట్టించుకున్న పాపాన పోని దుస్థితి, స్కూళ్లల్లో బాత్‌రూమ్‌లు కూడా సరిగా లేని పరిస్థితిని ప్రత్యక్షంగా చూశానన్నారు. అన్ని అసౌకర్యాల నడుమ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం వృథా అనే భావన ప్రజల్లో నెలకొందని అన్నారు. అందుకే ఖర్చు ఎక్కువైనా పిల్లలను ప్రైవేట్‌ స్కూళ్లల్లో తల్లిదండ్రులు చేర్పించేవారని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్రతిదీ ఇంగ్లిష్‌తోనే ముడి పడి ఉందని, ఈ పోటీ ప్రపంచంలో మనం పిల్లలకు ఇచ్చే ఏకైక ఆస్తి చదువు మాత్రమేనని జగన్ అన్నారు. పిల్లలను చదివించలేని పరిస్థితులను తల్లిదండ్రులు అధిగమించాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు. పేద విద్యార్థులు కూడా ఉన్నత చదువులు చదివాలని పేర్కొన్నారు. చాలా మంది ఫీజుల భారం భరించలేక, తమ పిల్లలను చదివించే స్తోమత లేక మధ్యలోనే వారి విద్యాభ్యాసాన్ని ఆపేస్తున్నారన్నారు. ఫీజుల భారాన్ని తన తండ్రి భరించలేకపోవడంతో భారంగా మారానని భావించిన ఓ కాలేజీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. పేదల కుటుంబం నుంచి కలెక్టరో లేదా పెద్ద ఉద్యోగో ఉంటే వారు ఆ పేదరికం నుంచి బయటకు వస్తారని జగన్ అన్నారు. లేనిపక్షంలో వారెప్పటికీ ఆ పేదరికంలోనే ఉంటారని అభిప్రాయపడ్డారు. పేదరిక నిర్మూలనకి ఉన్న ఏకైన పరిష్కారం చదువని ఆయన స్పష్టం చేశారు. అందుకే కన్నబిడ్డలను చదివించలేకపోతోన్న తల్లిదండ్రులున్న వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి శ్రీకారం చుట్టామని, అందుకే ప్రతి ప్రభుత్వ పాఠశాలలోను ఇంగ్లిషు మీడియంను అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు.

తల్లిదండ్రులే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న తమ బిడ్డలకు ఇంగ్లిష్ మీడియం విద్య కావాలని ఆకాంక్షించారని జగన్ చెప్పారు. సమాజం మొత్తాన్ని మార్చే ఇటువంటి బృహత్తర కార్యక్రమానికి కూడా టీడీపీ అడ్డంకులు సృష్టించే ప్రయత్నంలో ఉందని ఆయన మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా ఒకమాట చెబుతారు, బయటకు వచ్చి మాట మారుస్తారని ఆయన విమర్శించారు. శాసనసభలో ఇంగ్లిషు మీడియం బిల్లును కూడా అడ్డుకున్నారని, అయితే బిల్లును మళ్లీ ప్రవేశపెట్టి పాస్ చేశామని ఆయన చెప్పారు. ఇంగ్లిష్ మీడియం తీసుకొస్తే తెలుగును అగౌరవపర్చినట్లు అవుతుందని కొత్త సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్నారని, దీనిపై కోర్టులకు కూడా వెళ్లారని విచారం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed