అమూల్‌ ఒప్పందంతో పాడిపరిశ్రమకు మేలు : జగన్

by srinivas |
అమూల్‌ ఒప్పందంతో పాడిపరిశ్రమకు మేలు : జగన్
X

దిశ, ఏపీ బ్యూరో :
వ్యవసాయ, పాడిపరిశ్రమ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ముందజలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాడిపరిశ్రమ రంగంలో మంగళవారం ఏపీ ప్రభుత్వం కీలక అడుగువేసింది. దేశంలోని పాల ఉత్పత్తుల రంగంలో అగ్రగామిగా ఉన్న అమూల్‌ ఇండియా సంస్థతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతి రీజియన్‌ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఒప్పంద పత్రాలపై స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, అమూల్‌ చెన్నై జోనల్‌ హెడ్‌ రాజన్‌ సంతకాలు చేశారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మేనేజింగ్‌ డైరెక్టర్‌తో సీఎం మాట్లాడుతూ..

ఏపీలోని పాడిపరిశ్రమ రంగంలో మహిళల జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ఇదో గొప్ప అడుగుని చెప్పారు. వైఎస్సార్‌ చేయూత, ఆసరా కింద మహిళలకు ఇప్పటి వరకు రూ.11వేల కోట్ల సాయం చేశామన్నారు. ఈ ఒప్పందం వారి జీవితాల్లో వెలుగులు నింపేలా ఉండాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ సహకార డెయిరీలకు మంచి రోజులు వచ్చాయని అన్నారు. పాడి పరిశ్రమల రంగంలో దక్షిణాది రాష్ట్రాలకు గేట్‌ వేగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని సీఎం భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం వేసిన ఈ అడుగు పాడి రైతులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందేందుకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.

అమూల్ ఒప్పందం వల్ల పాడి రైతులకు మంచి ధర దక్కడమే కాకుండా వినియోగదారులకు కూడా సరసమైన ధరలకు నాణ్యమైన పాల ఉత్పత్తులు కొనుగోలు చేయగలుగుతారని అధికారులు తెలిపారు. పాడి పరిశ్రమల రంగంలో ప్రపంచపు అత్యుత్తమ టెక్నాలజీ, విస్తృతమైన మార్కెటింగ్‌ అవకాశాలు పాడి రైతులకు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ ఒప్పందంతో పాడి పరిశ్రమల రంగం మరింత గొప్పగా తయారవుతుందని సీఎంకు మేనేజింగ్‌ డైరెక్టర్‌ వివరించారు. దీంతో సీఎం మరోసారి… వైఎస్సార్‌ చేయూత, ఆసరా పథకం ద్వారా పాడి పరిశ్రమ రంగంలో లబ్దిపొందేలా ప్రోత్సహించాలని సూచించారు.

కాగా, పాడిపరిశ్రమల రంగంలో ఆంధ్రప్రదేశ్ అగ్రభాగాన ఉండేది. ఉమ్మడి ఏపీలో చిత్తూరు డెయిరీకి ఉన్న ప్రాముఖ్యత వర్ణించలేనిదని చెప్పుకొచ్చారు.పాడి రంగంలో ప్రభుత్వం నేరుగా ప్రైవేటు పరిశ్రమలను ప్రోత్సహించడంతో చిత్తూరు డెయిరీ ప్రతిష్ట క్రమంగా మసకబారిపోయింది. దీంతో విజయా డెయిరీ దశాబ్దాల పాటు తన హవా చాటింది. ఆ తర్వాత చాలా డెయిరీలు వచ్చాయి. సంగం డెయిరీ ఈ మధ్య కాలంలో పాపులర్ అవుతోంది. అన్నింటికీ మించి దేశవ్యాప్తంగా మార్కెట్ కలిగిన అమూల్ డెయిరీ ఏపీలో అడుగుపెట్టడమంటే రైతులకు మరిన్ని మంచిరోజులు వచ్చినట్టేనని వ్యవసాయ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed