రైతులను ముంచుతున్న అన్నారం బ్యారేజీ..

by Shyam |
రైతులను ముంచుతున్న అన్నారం బ్యారేజీ..
X

దిశ, మహదేవపూర్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అన్నారం గ్రామంలో రైతులు చేస్తున్న నిరాహార దీక్ష శుక్రవారం నాటికి మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా మహాదేవపూర్ జడ్పీటీసీ గుడాల అరుణ రైతుల గోడు విని, వారి సమస్యలను పరిష్కరించాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్యను ఒక ప్రకటనలో కోరారు.

అన్నారం బ్యారేజీ బ్యాక్ వాటర్ వలన అన్నారం, సండ్రుపల్లి, మద్దులపల్లి, నాగెపల్లి, పలుగుల, కుంట్లం గ్రామాల పంటభూములు ముంపునకు గురై గత రెండు సంవత్సరాలుగా రైతులు నష్టపోతున్నారని.. ఈ విషయాన్ని రెవెన్యూ, ఇంజినీరింగ్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా అధికారులు ప్రతిసారీ వచ్చి పంట నష్టాన్ని సర్వే చేసుకుని వెళ్తున్నారు కానీ, ఒక్కసారి కూడా నష్ట పరిహారం చెల్లించలేదని ఆరోపించారు. ఇప్పటికైనా రైతుల గోడు పట్టించుకుని ఎకరానికి రూ. 30,000 చొప్పున పంట నష్ట పరిహారం ఇప్పించాలని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా రైతుల పంట భూములను ప్రభుత్వమే కొనుగోలు చేసి, ఎకరానికి రూ.30 లక్షలు చొప్పున డబ్బులు ఇప్పించాలని కోరారు.

Advertisement

Next Story