ఆ విషయంలో వదిన భారతి రెడ్డికి వైఎస్ షర్మిల మద్దతు

by Ramesh Goud |
ఆ విషయంలో వదిన భారతి రెడ్డికి వైఎస్ షర్మిల మద్దతు
X

దిశ, వెబ్ డెస్క్: మహిళలపై నీచపు కామెంట్స్ చేసే సైకో గాళ్లను నడి రోడ్డుమీద ఉరి తీయాలని, అలాంటి సైతాన్ సైన్యానికి ఈ రెండు పార్టీలే ఆదర్శం అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (AP COngress Chief YS Sharmila) హాట్ కామెంట్స్ చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) సతీమణి వైఎస్ భారతి రెడ్డి (YS Bharathi Reddy)పై చేబ్రోలు కిరణ్ కుమార్ అనే వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన షర్మిల.. వదిన మద్దతుగా నిలుస్తూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఈ సందర్భంగా ఆమె.. భారతి రెడ్డి మీద సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమని అన్నారు. ఇలాంటి నీచపు కామెంట్స్ తీవ్రవాదంతో సమానమని, ఈ సైకో గాళ్లను నడి రోడ్డు మీద ఉరి తీసినా తప్పులేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కూతలు కూసిన వెధవలను, రేటింగ్స్ కోసం ఎంటర్ టైన్ చేసే యూట్యూబ్ ఛానళ్లపై కఠిన చర్యలు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. సమాజం ఇలాంటి మకిలి చేష్టలను హర్షించదని, ఏ పార్టీ వాళ్లైనా, ఎంతటి వాళ్లైనా శిక్ష పడాలని, టీడీపీ (TDP), జనసేన (Janasena , బీజేపీ (BJP)ల కూటమి ప్రభుత్వాన్ని (Coalition Government) సాటి మహిళగా డిమాండ్ చేస్తున్నానని అన్నారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడే నీచపు వ్యవస్థ ఒక్క మన రాష్ట్రంలోనే ఉందని, ఈ విష సంస్కృతికి బీజం వేసింది వైసీపీ (YSRCP), టీడీపీలేనని సంచలన వ్యాఖ్యలు చేశారు.

సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టే సైతాన్ సైన్యానికి రెండు పార్టీలే ఆదర్శమని, అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఉచ్ఛం, నీచం, మానం, మర్యాద లేకుండా ప్రవర్తించారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రక్త సంబంధాన్ని మరిచి, రాజకీయ కక్ష్యతో కుటుంబాలను రోడ్డు మీదకు లాగారని, మనిషి పుట్టుకను అనుమానించి రాక్షసానందం పొందారని ఫైర్ అయ్యారు. అన్యం పుణ్యం ఎరుగని పసి పిల్లలను సైతం గుంజారని, అక్రమ సంబంధాలు అంటగట్టి, మీరు పెంచి పోషించిన కాలకేయులే ఇప్పుడు వ్యవస్థను భ్రష్టు పట్టించారని అన్నారు. ఈ దారుణ సంస్కృతిని వెలివేయడానికి అన్ని పార్టీలు ముందుకు రావాలని వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు.



Next Story