రాజానగరం క్యాండిడేట్ ఎవరు? టీడీపీ స్పెషల్ ఫోకస్..!

by Sathputhe Rajesh |
రాజానగరం క్యాండిడేట్ ఎవరు?  టీడీపీ స్పెషల్ ఫోకస్..!
X

దిశ (ఉభయ గోదావరి ప్రతినిధి): ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రాజానగరం నియోజకవర్గం టీడీపీలో అయోమయం నెలకొని ఉంది. పార్టీ అభ్యర్థిని ఇంకా ఫైనల్ చేయలేదు. కొత్త వ్యక్తికి అవకాశం కల్పిస్తారనే ప్రచారం మొదలైంది. ఎన్నికలకు ఇంకొన్ని రోజులే ఉన్న నేపథ్యంలో ఈ విషయం త్వరగా తేల్చాలని పార్టీ శ్రేణులు కోరుతున్నారు. గత ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన తరువాత మాజీ శాసన సభ్యడు పెందుర్తి వెంకటేష్ రాజకీయాలకు కొన్ని రోజులు దూరమయ్యారు. వ్యాపారాలకే అంకితం అయ్యారు. ఆ తరువాత కొద్ది రోజుల క్రితం మరలా పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు.

ఇక్కడ వైసీపీ తరుపున మాజీ మంత్రి దివంగత జక్కంపూడి రామ్మోహరావు కుమారుడు జక్కంపూడి రాజా శాసన సభ్యుడిగా ఉన్నారు. ఈయనను రాబోవు ఎన్నికల్లో ఓడించాలంటే, నియోజకవర్గంలో బలమైన వర్గం ఉన్న నాయకుడు అవసరం ఉందని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు. రాజానగరంలో కాపు సామాజిక వర్గం ఎక్కువ. ఈ నేపథ్యంలో కొత్త వారికి అవకాశం ఇచ్చి నిమ్మకాయల చిన రాజప్పను ఇక్కడి నుంచి బరిలోకి దింపితే గెలుపు సునాయాసమవుతుందనే వాదన వినిపిస్తుంది.

2019 తరువాత టీడీపీ వీక్!

2014 టీడీపీ ప్రభంజనంలో రాజానగరంలో పెందుర్తి వెంకటేష్ గెలిచారు. తర్వాత 2019లో ఆయన ఓటమి పాలయ్యారు. ఆ తరువాత ప్రతిపక్ష నేతగా ఆయన సరైన పాత్ర పోషించలేదనే విమర్శలు వచ్చాయి. దీంతో స్థానికంగా పార్టీ పూర్తిగా వీక్ అయిపోయింది. దాంతో వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా బలపడిపోయారు. కాగా, ప్రస్తుతం రాష్ర్ట వ్యాప్తంగా తెలుగుదేశం పుంజుకుంటోంది. రాజానగరంలో మాత్రం నిస్సత్తువగా ఉండటంపై పార్టీ శ్రేణులు అసహనానికి గురవుతున్నారు.

స్థానికంగా రాజా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. జగన్ ప్రభుత్వం మూడు రాజధానులు, ధరల పెరుగుదల తదితర అనేక అంశాలపై గోదావరి జిల్లాల్లోని టీడీపీ నేతలు విమర్శల దాడి చేస్తున్నారు. అయితే, రాజానగరంలో మాత్రం ఆ పార్టీ తరుపున ప్రశ్నించే సరైన నాయకత్వం లేకపోవడంపై అభిమానుల్లో నీరసం వచ్చింది. పార్టీ వీక్ అయిందనే పుకారు మొదలైంది.

రాజప్ప సరైన అభ్యర్థి..

మాజీ హోంమంత్రి నిమ్మకాయల చిన రాజప్పను రాజానగరానికి పంపితే ఎలా ఉంటుందనే ఆలోచన పార్టీ పెద్దల్లో మొదలైందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన పెద్దాపురం శాసన సభ్యునిగా వ్యవహరిస్తున్నారు. మూడో సారి కూడా అక్కడి నుంచే పోటీ చేస్తారని చంద్రబాబు కూడా ఇటీవల ప్రకటించారు. అయితే, ఈ విషయమై పెద్ద చర్చనీయాంశంగా మారింది. పెద్దాపురంలో రాజప్ప గెలుపు ఈ సారి కష్టమనే ప్రచారం జరుగుతుంది.

వర్గపోరును ఎదుర్కోవడమే కాకుండా, ఇక్కడి సీటు కమ్మ సామాజిక వర్గానికి కేటాయించాలని డిమాండ్ వినిపిస్తోంది. స్థానిక నేతల అభిప్రాయాలను పట్టించుకోకుండా ఏకపక్షంగా రాజప్పకు సీటు ప్రకటించడంపై మండిపడుతున్నారు. అంతర్గతంగా వైసీపీకి సపోర్టు చేస్తారనే పుకార్లు వినిపిస్తున్నాయి. మధ్యే మార్గంగా రాజప్పను రాజానగరం పంపిస్తే అక్కడి కాపు సామాజిక వర్గం నుంచి పార్టీకి మంచి బలం చేకూరుతుందనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed