డీఎస్సీ శిక్షణతో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు.. మంత్రి నిమ్మల కీలక వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
డీఎస్సీ శిక్షణతో ఉత్తమ ఫలితాలు  సాధించవచ్చు.. మంత్రి నిమ్మల కీలక వ్యాఖ్యలు
X

దిశ, పాలకొల్లు: నిరుద్యోగ యువకులు డీఎస్సీ శిక్షణను సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలను సాధించడం ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందవచ్చునని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, ఉపాధ్యాయులు సబ్జెక్టుల వారీగా చెప్పే బోధనను ఇష్టపడి ఏకాగ్రతతో విని చదివితే విజయం మీదేనన్నారు. పాలకొల్లులోని బి ఆర్ ఎం వి మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శనివారం సాయంత్రం మంత్రి రామానాయుడు ఆధ్వర్యంలో తలపెట్టిన డీఎస్సీ ఉచిత శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. పాలకొల్లు నియోజకవర్గం కు చెందిన శిక్షణ పొందే ఏడు వందల మంది వరకు నిరుద్యోగ యువతి యువకులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకునేలా యువతకు ఉపాధ్యాయ ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వ అధికారంలోకి రాగానే డీఎస్సీ పై మొదటి సంతకం చేశారన్నారు. ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో ఉన్న ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడుతుందని చెప్పారు. నియోజకవర్గ పరిధిలోని కొందరు యువతీ యువకులు తన వద్దకు వచ్చి డీఎస్సీ ఉచిత శిక్షణ ఇప్పించాలని కోరినట్లు తెలిపారు. తాను మొదట వంద నుంచి 150 మంది వరకు ఉంటారని భావించి దరఖాస్తులు ఇమ్మని ప్రచారం చేయడంతో 700 వరకు దరఖాస్తులు రావడం తో మీ అందరి భవిష్యత్తు కోసం ఇబ్బందులు, వ్యయ ప్రయాసలు ఉన్నప్పటికీ వెనకడుగు వేయకుండా ఉచిత శిక్షణ తరగతులు ఇప్పించేలా ముందడుగు వేసాను అన్నారు.

అది కూడా ఎక్కడా రాజీ పడకుండా మీకు మంచి బోధన అందించాలనే ఉద్దేశంతో అవనిగడ్డ ప్రగతి కోచింగ్ సెంటర్ నిర్వాహకులు పూర్ణ సహకారంతో నడిపేందుకు అక్కడికి స్వయంగా వెళ్లి మాట్లాడగా అందుకు అంగీకరించారన్నారు. తరగతుల నిర్వహణకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రూ పది లక్షల వరకు వెచ్చించి ప్రత్యేక షెడ్లు ఏర్పాటుతోపాటు అన్ని మౌలిక వసతులు కల్పించడం జరిగిందన్నారు. మూడు నెలలపాటు జరిగే ఈ శిక్షణా తరగతులకు ప్రతి ఒక్కరూ కచ్చితంగా సమయపాలన పాటిస్తూ నూరు శాతం హాజరు కావాలని మంత్రి రామానాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో శిక్షణ తరగతులు ప్రిన్సిపల్ డి రామలింగేశ్వరరావు, కోఆర్డినేటర్ రావూరి వెంకట అప్పారావు, ట్రస్టు సభ్యులు పెచ్చెట్టి బాబు, గండేటి వెంకటేశ్వరరావు, బొక్క రమాకాంత్, పీతల శ్రీనివాస్, గుమళ్ళ వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed