విశాఖ పోలీసులకు రౌడీ‌షీటర్ సవాల్

by srinivas |   ( Updated:2022-12-23 12:02:53.0  )
విశాఖ పోలీసులకు రౌడీ‌షీటర్ సవాల్
X

దిశ, ఉత్తరాంధ్ర: విశాఖ మహా నగరంలో రౌడీ షీటర్లు నడిరోడ్డుపై కత్తులు పట్టుకుని పోలీసులకే హెచ్చరికలు జారీ చేశారు. 'మమ్మల్ని పోలీసులు ఏమీ పీకలేరు' అంటూ వీరంగం చేశారు. రౌడీషీటర్లు ఎప్పటికప్పుడు విశాఖలో రెచ్చిపోతున్నా వారిని అణిచివేయడంలో పోలీసులు ఘోరంగా విఫలమవుతున్నారు. నగరంలో ఎక్కడపడితే అక్కడ గంజాయి, డ్రగ్స్‌ సేవిస్తున్నట్టు సమాచారం అందుతున్నా పోలీసులు చూసీ చూడనట్టు పోతున్నారు. చివరకు ఈ గ్యాంగ్‌ సభ్యులు పోలీసులకే సవాల్‌ విసిరే స్థాయికి ఎదిగిపోయారు. రోడ్లమీద స్వైర విహారం చేస్తూ కత్తులతో భయపెడుతున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై పీడీ యాక్ట్‌ పెట్టి పంపించేస్తున్నామని చెబుతున్నా వారంతా నగర శివార్లు దాటి పక్క ప్రాంతానికే వెళ్లి మళ్లీ ఆర్నెళ్ల తర్వాత వచ్చేస్తున్నారు. 60 శాతం మందిని జైలుకు పంపించామని చెబుతున్నా కారాగారంలోనూ వారు మరికొందరితో సావాసం ఏర్పాటు చేసుకుని బయటకు వచ్చాక మళ్లీ రెచ్చిపోతున్నారు. తాజాగా టూటౌన్‌ పరిధిలోని కల్లుపాకల ప్రాంతంలో ఓ రౌడీషీటర్‌ హల్‌ చల్‌ చేసిన వీడియో ప్రజల్లో దడ పుట్టిస్తోంది.

దండుపాలెం బ్యాచ్‌కు చెందిన తరుణ్‌ అనే యువకుడు ఈ నెల 19న రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఆయన తండ్రి శబరిమల యాత్రకు వెళ్లడంతో ఇతర కుటుంబ సభ్యులు తరుణ్‌ అంత్యక్రియల్ని ఈ నెల 21న నిర్వహించారు. టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కల్లుపాకల ప్రాంతం నుంచి రామకృష్ణా జంక్షన్‌ మీదుగా అంత్యక్రియల ర్యాలీ సాగుతుండగా రౌడీ షీటర్‌ వీర్ల వినయ్‌ అలియాస్‌ విక్కీ కత్తితో వీరంగం చేశాడు. పోలీసులేమీ చేయలేరంటూ సవాల్‌ విసిరాడు. ఆ వీడియా ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంపై విశాఖలో శాంతిభద్రతల పరిరక్షణపై అనుమానాలు తలెత్తుతున్నాయి. విశాఖ పోలీసులు రౌటీషీటర్ల వ్యవహారంపై ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed