టీడీపీ ‘మోత మోగిద్దాం’పై విజయసాయిరెడ్డి సెటైర్స్

by srinivas |   ( Updated:2023-09-30 13:10:28.0  )
టీడీపీ ‘మోత మోగిద్దాం’పై విజయసాయిరెడ్డి సెటైర్స్
X

దిశ, వెబ్ డెస్క్: చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు నిరసన టీడీపీ ‘మోతమోగిద్దాం’ కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు. లంచాలు తీసుకుని కంచాలు మోగించడమేంటని ప్రశ్నించారు. కంచాలు ఢిల్లీలో మోగిస్తే బాగుంటుందేమోనని అక్కడ ఉన్న నారా లోకేశ్‌ను ఉద్దేశించి సెటైర్లు వేశారు. ఆదాయపు పన్ను ఆఫీసు ముందు మోగించాలని సూచించారు. టీడీపీ వాళ్లు ఆంధ్రప్రదేశ్ జనాలను ఏం చెప్పదలుచుకున్నారని ప్రశ్నించారు. నీతిపరులని చెప్పాలనుకుంటే విచారణ ఎదుర్కోండని చెప్పారు. స్టేలు తెచ్చుకోకుండా విచారణకు రావాలని, నీతిపరులైతే తన సవాల్ ను స్వీకరించాలన్నారు. ఏం చేస్తారో.. చేసుకోండని పదే పదే చంద్రబాబు, లోకేశ్ అన్నారని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. చంద్రబాబును సీఐడీ అధికారులు ఆధారాలతోనే అరెస్ట్ చేసిందని విజయసాయిరెడ్డి చెప్పారు. స్కాంలపై చంద్రబాబు అడిగితే చెబుతారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఆస్తుల విలువ రూ.5 లక్షల కోట్ల నుంచి 6 లక్షల కోట్ల రూపాయల వరకు ఉంటాయని ఆరోపించారు. ముందస్తు ఎన్నికలు ఉండవని.. షెడ్యూల్ ప్రకారమే ఉంటాయని తెలిపారు. ఈసారి సైతం వైసీపీనే అధికారంలోకి వస్తుందని విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

కాగా చంద్రబాబును అక్రమం అరెస్ట్ చేశారంటూ నారా బ్రాహ్మణి మోత మోగిద్దాం కార్యక్రమానికి పిలుపు నిచ్చారు. చంద్రబాబుకు మద్దతుగా జగన్ వినిపించేలా ఈ రోజు రాత్రి 7 గంటల నుంచి 5 నిమిషాల పాటు ఏదో రకంగా మోత మోగించాలని ప్రజలను ఆమె కోరారు. ఇంట్లోనో, ఆఫీసులోనో ఇంకెక్కడ ఉన్న బయటకు వచ్చి గంట లేదా ప్లేట్ పై గరిటెతో కొట్టాలని.. లేదంటే విజిల్ వేయాలని, రోడ్డు మీద ఉంటే హారన్ కొట్టి చంద్రబాబుకు సంఘీభావం తెలపాలని నారా బ్రాహ్మిణి పిలుపునిచ్చారు. దీంతో మరికొద్దిసేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభంకానుండటంతో వైసీపీ నేతలు విమర్శలకు దిగారు.

Advertisement

Next Story