ఏపీ దొంగ ఓట్లపై కేసు విచారణలో ట్విస్ట్: విచారణ నుంచి తప్పుకున్న జడ్జి

by Seetharam |   ( Updated:2023-11-07 08:34:14.0  )
ఏపీ దొంగ ఓట్లపై కేసు విచారణలో ట్విస్ట్: విచారణ నుంచి తప్పుకున్న జడ్జి
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీ దొంగ ఓట్లపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే మంగళవారం విచారణ సందర్భంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. గతంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన నేపథ్యంలో విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఏపీలో దొంగ ఓట్లపై మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆధ్వర్యంలోని సిటిజెన్స్ ఫర్ డెమొక్రసీ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఐప్యాక్ మాజీ ఉద్యోగుల చేత దొంగ ఓట్లు చేర్చుతున్నారని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆ పిటిషన్‌లో ఆరోపించారు. ర్యామ్ ఇన్ఫో లిమిటెడ్, ఉపాధి టెక్నో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, మ్యాక్ డిటెక్టివ్ అండ్ గార్డింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు వలంటీర్ల ద్వారా సేకరించిన డేటాను ఫ్రొపైలింగ్ చేస్తున్నాయని పిటీషన్‌లో ఆరోపించారు. ఈ సంస్థలకు రూ.68కోట్లు ప్రజాధనాన్ని వెచ్చించినట్లు పిటిషన్‌లో నిమ్మగడ్డ ఆరోపించారు. ఈ మేరకు ఐ ప్యాక్ మాజీ ఉద్యోగుల నిర్వాకాన్ని బట్టబయలు చేసిన సంగతి తెలిసిందే.

మరో ధర్మాసనం ముందుకు కేసు

ఏపీలో దొంగ ఓట్లపై మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆధ్వర్యంలోని సిటిజెన్స్ ఫర్ డెమొక్రసీ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇప్పటికే విచారణ జరిపిన ధర్మాసనం తదుపరి విచారణను నవంబర్ 7కు వాయిదా వేసింది. దీంతో మంగళవారం ఈ కేసు విచారణ ప్రారంభమైంది. అయితే ఈ కేసు విచారణ ప్రారంభం కాకముందే తాను ఈ కేసు నుంచి తప్పుకుంటున్నట్లు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రకటించారు. గతంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినందున ఈ కేసు విచారణనుంచి తప్పకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో సీజేఐ ఆదేశాలతో మరో ధర్మాసనం ముందు లిస్ట్ చేయాలని రిజిస్ట్రీకి జస్టిస్ బిఆర్ గవాయి సూచించారు. ఇకపోతే ఓటర్ల నమోదులో ఏపీ ప్రభుత్వం యధేచ్చగా జోక్యం చేసుకుంటోదంటూ సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ ఆరోపించింది. ఓటర్ల నమోదులో గ్రామ, వార్డు వాలంటీర్లు, కార్యదర్శులను భాగస్వాములను చేయడంపైనా సిటిజెన్స్ ఫర్ డెమొక్రసీ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story