వైసీపీలో విపత్కర పరిస్థితి.. గుంభనంగా అసంతృప్తి ఎమ్మెల్యేలు

by Hamsa |
వైసీపీలో విపత్కర పరిస్థితి.. గుంభనంగా అసంతృప్తి ఎమ్మెల్యేలు
X

డబ్బుకు అమ్ముడుపోయారంటారు. తల్లిలాంటి పార్టీకి ద్రోహం చేశారంటారు. ఇంకా ఎన్నో.. మరెన్నో. మరోవైపు వేటు పడిన వాళ్ళు లేవనెత్తుతున్న అంశాలకు అధికార వైసీపీ నుంచి సమాధానం లేదు. దీంతో సస్పెన్షన్​కు గురైన ఎమ్మెల్యేల వాదనకు మరింత బలం పెరుగుతోంది. సదరు ఎమ్మెల్యేలు చెబుతున్న అంశాలు కొట్టిపారేయదగ్గవి కాదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించే ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఇన్​చార్జులకు పెత్తనమివ్వడాన్ని సహించలేకపోతున్నారు. ప్రజలు ఎన్నుకున్న తమను కాదని వేరొకరికి బాధ్యతలు ఇవ్వడాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఇలాంటి నిర్ణయం నుంచి వెనక్కి మరలకుంటే అసలు సీఎం జగన్​కు మద్దతుగా ఎంతమంది ఎమ్మెల్యేలు నిలుస్తారనేది ప్రశ్నార్థకమైంది. ఇదే విషయం అటు పార్టీ శ్రేణుల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.

దిశ, ఏపీ బ్యూరో: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్ష టీడీపీకి ఓటేశారంటూ నలుగురు ఎమ్మెల్యేలను వైసీపీ సస్పెండ్​చేసింది. వారిలో ఒకరైన నెల్లూరు రూరల్​ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్​రెడ్డి సంధిస్తున్న ప్రశ్నలకు అధికార పార్టీ వద్ద సమాధానం లేదు. ఓ ప్రతిపక్ష పార్టీ పదిహేను నుంచి ఇరవై కోట్లు ఆఫర్​ఇస్తే మరి టీడీపీ ఎమ్మెల్యేలకు వైసీపీ ఎంత ఆఫర్​చేసిందో చెప్పాలన్నారు. సంఖ్యాపరంగా 23 మంది సభ్యులు టీడీపీకి ఉంటే వాళ్ల ఎమ్మెల్యేలను నమ్ముకొని ఏడుగురిని పోటీకి దించారా అని ప్రశ్నిస్తున్నారు. ప్రజా సమస్యలపై అధికార పార్టీ ఎమ్మెల్యేగా తాను ప్రస్తావిస్తే అర్థం చేసుకోకుండా అవాకులు చెవాకులు పేలొద్దని కోటంరెడ్డి హితవు పలికారు.

ఆనం వారి ఆగ్రహం..

మరో ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అయితే ప్రజలు ఎన్నుకున్న తమను కాదని పార్టీ వేరొకరికి నియోజకవర్గ బాధ్యతలు ఎలా ఇస్తారని నిలదీశారు. ప్రజల అభివృద్ధి కోసం మేం పార్టీలు మారుతున్నాం. దోచుకున్నది దాచుకోవడానికి కాదు. లేదంటే సీబీఐ, ఈడీ కేసులను తప్పించుకోవడానికి అధికారాన్ని వాడుకోవడం లేదని చురకలేస్తున్నారు. ఇంకో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి స్పందిస్తూ మేము పార్టీకి ఎదురు డబ్బులిచ్చి నోళ్లం. మేం అమ్ముడుబోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇనుప సంకెళ్ల నుంచి స్వేచ్చ లభించినట్లుందని ఎమ్మెల్యే శ్రీదేవి చెబుతున్నారు. వీళ్లంతా లేవనెత్తిన అంశాలపై వైసీపీ పెద్దలు దీటుగా సమాధానాలు ఇవ్వలేకపోయారు.

వైవీ సుబ్బారెడ్డికీ ఎసరు?

వైసీపీలో ఓ కోటరీ నడుస్తోంది. సీఎం జగన్​కు, ప్రజాప్రతినిధుల మధ్య ఇది నాటకాలాడుతోందనే ప్రచారం ఊపందుకుంది. పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఇటీవల ప్రభుత్వ సంబంధిత కార్యక్రమాల్లో అంటీముట్టనట్లున్నారు. మరో కీలక నేత వైవీ సుబ్బారెడ్డిని కూడా సీఎంకు దూరం చేసే ఎత్తుగడలు కొనసాగుతున్నట్లు ప్రచారం. ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసే ప్రతి అభ్యర్థికి 22 మంది ఎమ్మెల్యేలను కేటాయించారు. అందులో కోలా గురువులుకు కేటాయించిన ఎమ్మెల్యేల్లో ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు. పార్టీపై అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలను వైవీ సుబ్బారెడ్డి సిఫారసు చేసిన కోలా గురువులుకు కేటాయించడంలో మతలబు ఏమిటని పార్టీలో చెవులు కొరుక్కుంటున్నారు. వైవీని అప్రదిష్టపాల్జేసేందుకు పార్టీలో కుట్ర జరుగుతోందని ఆయన వర్గం కువకువలాడుతోంది. ధిక్కార స్వరం వినిపించే నేతల సంఖ్య త్వరలోనే మరింత పెరుగుతుందనే టాక్​నడుస్తోంది.

ఇవి నిరంకుశ పోకడలే..

ఏ రాజకీయ పార్టీలోనైనా అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటే అది పది కాలాలపాటు మనగలుగుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ నిర్ణయం తీసుకుంటే ముందుగానే దాన్ని బయటకు లీక్​చేస్తారు. ఎవరేమనుకుంటున్నారో పరిశీలిస్తారు. తర్వాత తనకు బాగా దగ్గరగా మెలిగే వాళ్లతో ప్రతిపాదనలు పెట్టిస్తారు. సభ్యులంతా చర్చిస్తారు. లౌక్యంతో ఏకగ్రీవంగా ఆమోదించేట్లు చేస్తారు. అది ఆయన అనుసరించే విధానం. వైసీపీలో దీనికి భిన్నంగా ఉంటుంది. సీఎం జగన్​ఆదేశిస్తారు. మిగతా వాళ్లంతా ఆ ఆదేశాలను పాటించడమే. మరో ఆలోచనకు తావుండదు. ఇలాంటి నిరంకుశ పోకడలను ఎమ్మెల్యేలు, మంత్రులు భరించలేకపోతున్నారు. గళం విప్పడానికి సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు నలుగురు ఎమ్మెల్యేలు బయటకు వెళ్లి అడుగుతున్న ప్రశ్నలే అందరి మదిలో మెదులుతున్నాయి. ఇకనైనా కోటరీని బద్దలు చేసి అధినేత తీరు మార్చుకోకుంటే పార్టీలో మిగిలేదెవరనే చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed