ఆ నియోజకవర్గంలో క్లీన్ అండ్ గ్రీన్.. సొంత డబ్బుతో పనులు చేయిస్తున్న మంత్రి

by Jakkula Mamatha |
ఆ నియోజకవర్గంలో క్లీన్ అండ్ గ్రీన్.. సొంత డబ్బుతో పనులు చేయిస్తున్న మంత్రి
X

దిశ, మంగళగిరి: మంగళగిరి నియోజకవర్గం రూపురేఖలు మార్చేందుకు మంత్రి నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఇందులో భాగంగా ఆయన తన సొంత నిధులు కూడా వెచ్చిస్తున్నారు. మంగళగిరి నీ క్లీన్ అండ్ గ్రీన్‌గా ఉంచేందుకు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ తన సొంత నిధులు వెచ్చించి తీర్చిదిద్దే కార్యక్రమానికి ఆదివారం శ్రీకరం చుట్టించారు. మంగళగిరి నియోజకవర్గాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు సొంతంగా 5 గ్రాస్ కటింగ్ మిషన్లు కొనుగోలు చేయడంతో పాటు వాటిని వినియోగించి పిచ్చి మొక్కలు, గడ్డి తొలగించేందుకు ఐదుగురు కార్మికులను నియమించారు.

వీరికి అవసరమైన జీతభత్యాలను నారా లోకేష్ సొంత నిధుల నుంచే వెచ్చిస్తున్నారు. ఒక్కో గ్రాస్ కటింగ్ మిషన్ కొనుగోలుకు రూ.18 వేల వరకు ఖర్చు చేశారు. ఆదివారం ఉదయం నుంచే మంగళగిరి పట్టణంలోని పానకాల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఘాట్ రోడ్డుతో పాటు పలు ప్రాంతాల్లో యంత్రాల సాయంతో గడ్డిని, పిచ్చి మొక్కలను తొలగించారు. ఆయా పనులను టీడీపీ నాయకులు దగ్గరుండి పర్యవేక్షించారు. మంగళగిరి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు మంత్రి నారా లోకేష్ చూపిస్తున్న చొరవ పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story