Godavari Flood:తగ్గిన గోదావరి..భద్రాచలం వద్ద మొదటి హెచ్చరిక ఉపసంహరణ

by Jakkula Mamatha |   ( Updated:2024-08-01 14:39:45.0  )
Godavari Flood:తగ్గిన గోదావరి..భద్రాచలం వద్ద మొదటి హెచ్చరిక ఉపసంహరణ
X

దిశ, పోలవరం:గత కొన్ని రోజులుగా పెరుగుతూ తగ్గుతూ వస్తున్న గోదావరి నీటిమట్టం గురువారం సాయంత్రానికి తగ్గుముఖం పట్టింది. పోలవరంలో గోదావరి నీటిమట్టం బుధవారం సాయంత్రానికి స్వల్పంగా పెరిగింది. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే నుంచి 9,65,820 క్యూసెక్కుల వరద జలాలను అధికారులు దిగువకు విడుదల చేశారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే ఎగువన 32.510 మీటర్లు, స్పిల్ వే దిగువన 24.130 మీటర్ల నీటిమట్టం నమోదైనట్లు పోలవరం ప్రాజెక్టు అధికారులు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు దిగువన పోలవరం గ్రామ పరిధిలో గోదావరి నీటిమట్టం 23.187మీటర్లకు చేరుకున్నట్లు, 9,67,000 క్యూసెక్కుల వరద జలాలు దిగువకు విడుదల చేసినట్లు సిడబ్ల్యుసి అధికారులు తెలిపారు.

భద్రాచలం వద్ద సాయంత్రం 6.25 గంటలకు 41.20 అడుగులకు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం 14.42 మీటర్లు ఉందని, వరద ఉధృతి క్రమక్రమంగా తగ్గుతుందని, 10,60,000 క్యూసెక్కుల వరద జలాలు దిగువకు విడుదల చేసినట్లు, మొదటి ప్రమాద హెచ్చరిక అమలులో ఉన్నట్లు భద్రాచలం వద్ద నీటిమట్టం తగ్గుతున్న నేపథ్యంలో శుక్రవారం నాటికి నీటిమట్టం తొలుత పెరిగి తర్వాత తగ్గే అవకాశాలున్నాయని ధవళేశ్వరం బ్యారేజీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమేష్ తెలిపారు. పోలవరంలో గోదావరి నీటిమట్టం తగ్గడంతో కడమ్మ ఫ్లూయిజ్ వద్ద నీటిమట్టం కొంతమేర తగ్గడంతో ఏటిగట్టుకు కుడివైపున ఉన్న కొండవాగుల జలాలు గోదావరిలోకి ప్రవహిస్తున్నాయి.

Advertisement

Next Story