స్టీల్ ప్లాంట్‌పై చర్చలు : కేంద్ర ఉక్కు కార్యదర్శితో ఎంపీ జీవీఎల్ భేటీ

by Seetharam |
స్టీల్ ప్లాంట్‌పై చర్చలు : కేంద్ర ఉక్కు కార్యదర్శితో ఎంపీ జీవీఎల్ భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో : కేంద్ర ఉక్కు కార్యదర్శి నాగేంద్రనాథ్ సిన్హా‌తో బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు భేటీ అయ్యారు. ఈ మేరకు RINL ప్లాంట్, అధికారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కరించే అంశంపై సుదీర్ఘ చర్చలు జరిపారు. ఎంపీ జీవీఎల్‌తోపాటు ఆర్‌ఐఎన్‌ఎల్‌కు చెందిన స్టీల్ ఎగ్జిక్యూవ్స్ అసోసియేషన్ (ఎస్‌ఇఎ) ప్రధాన కార్యదర్శి కేవీడీ ప్రసాద్ మరియు ఇతరులు ఉద్యోగులు ఉన్నారు. RINL బోర్డు ద్వారా ప్రమోషన్ పాలసీని ఖరారు చేయడంలో జాప్యం కారణంగా 2019 నుండి పెండింగ్‌లో ఉన్న RINL ఎగ్జిక్యూటివ్‌ల పదోన్నతుల పెండింగ్ సమస్యను ఈ సమావేశంలో ఎంపీ జీవీఎల్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. గతవారం విశాఖపట్నంలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు RINL ఎగ్జిక్యూటివ్‌లను కలిశారు. ఇందులో అనేక మంది యువ ఇంజనీర్లు 2012లో ప్రీమియర్ ఇంజనీరింగ్ కళాశాలల నుండి పెద్ద ఆశలు మరియు ఆకాంక్షలతో RINLలో చేరారు. ఈ యువ ఇంజనీర్లకు 2021 నుంచి టైమ్‌బౌండ్ ప్రమోషన్లు ఇవ్వడం లేదని.. దీంతో వారి నైతిక స్థైర్యం బాగా తగ్గిపోయిందని ఎంపీ జీవీఎల్ కేంద్ర ఉక్కు కార్యదర్శి నాగేంద్రనాథ్ సిన్హాకి తెలియజేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎండిసి)కి చెందిన బచేలి, కిరండోల్ ఇనుప ఖనిజం గనుల నుంచి ఇనుప ఖనిజం సరఫరా చేయాలన్న అంశాన్ని కూడా ఎంపీ జీవీఎల్ చర్చించారు. ఇటీవల విశాఖపట్నంలోని ఆర్‌ఐఎన్‌ఎల్‌ను సందర్శించిన ఉక్కు శాఖ కార్యదర్శి అన్ని సమస్యలపై సానుకూలంగా స్పందించారని, ఆర్‌ఐఎన్‌ఎల్ మరియు దాని ఉద్యోగులకు మద్దతుగా హామీ ఇచ్చారని ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు.

Advertisement

Next Story