దేశాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించేలా బడ్జెట్.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

by Ramesh Goud |
దేశాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించేలా బడ్జెట్.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
X

దిశ, వెబ్ డెస్క్: దేశాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించేలా కేంద్ర బడ్జెట్(Union budget) ఉన్నదని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అన్నారు. కేంద్ర బడ్జెట్ పై స్పందించిన ఆయన.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్షేమం- సంస్కరణలు సమపాళ్ళుగా, వికసిత్ భారత్ (viksit Bharath) లక్ష్యంగా ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Union Minister Nirmala Sitharaman) ప్రవేశపెట్టిన బడ్జెట్ ను మనస్ఫూర్తిగా స్వాగతించారు. అలాగే వ్యవసాయ, రైతాంగ, పారిశ్రామిక, సైన్స్ & టెక్నాలజీ, ఔషద, విమానయాన, మౌలిక రంగాల్లో సమూల మార్పులు చేస్తూ పేదరికం తగ్గించే దిశగా, ప్రజల జీవన ప్రమాణాలు పెంచే దిశగా, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేలా బడ్జెట్ రూపొందించినందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అంతేగాక ముందుగా ఆదాయ పన్ను మినహాయింపు 12 లక్షలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం మధ్యతరగతి ఉద్యోగులకు భారీ ఊరటగా నిలిచిందని, ఒకేసారి 5 లక్షల పన్ను మినహాయింపు చేస్తూ 7 లక్షల నుండి 12 లక్షలకు పెంచడం సాహసోపేతమైన నిర్ణయమని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి సహకారం అందించేలా కేంద్ర బడ్జెట్

ఇక ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల కాలంలో రాష్ట్రంలో రూ.3 లక్షల కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలకు సహకారం అందించిన కేంద్ర ప్రభుత్వం ఈరోజు పార్లమెంట్ లో ప్రకటించిన 2025-2026 వార్షిక బడ్జెట్ లో మరిన్ని కేటాయింపులు చేస్తూ నిర్ణయం తీసుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామమని చెప్పారు. 5 కోట్ల ప్రజల ఆశలకు ప్రతిరూపంగా నిర్మాణం జరుగుతున్న ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.15,000 కోట్లను కేటాయిస్తూ, భవిష్యత్తులో మరింత సహకారం అందిస్తాం అని చెప్పడం రాజధాని నిర్మాణం సజావుగా, వేగవంతంగా సాగేందుకు ఉపయోగపడనుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు వ్యయ సవరణకు ఆమోదం తెలుపడమే కాకుండా రూ.5,936 కోట్లను కేటాయించడం, నీటి నిల్వ సామర్థ్యాన్ని 41.15 మీటర్లు ఇచ్చేందుకు అనుమతి ఇవ్వడం, బ్యాలెన్స్ గ్రాంట్ రూ. 12,157 కోట్లుగా ప్రకటించడం, పోలవరం అథారిటీకి అదనంగా మరో రూ.54 కోట్లు కేటాయించి, పోలవరం నిర్మాణం వేగవంతం అయ్యేందుకు సహకరించారని అన్నారు.

జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని 2028 వరకు పొడిగించడం ద్వారా ప్రతీ ఇంటికి మంచినీటి కనెక్షన్ అందించాలనే ఆశయాన్ని సాధించేందుకు తోడ్పడనుందని, కేంద్ర బడ్జెట్ లో రక్షణ శాఖ తరవాత అత్యధికంగా 2.66 లక్షల కోట్ల నిధులను గ్రామీణాభివృద్ధికి కేటాయించడం ద్వారా, రాష్ట్రంలోని ప్రతీ గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు అధిక నిధులు సాధించే ఆస్కారం లభించిందని తెలిపారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ. 3295 కోట్లను కేటాయించడం ద్వారా స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు NDA ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి రుజువైందని, అలాగే విశాఖ పోర్ట్ అభివృద్ధికి రూ. 730 కోట్లు కేటాయింపు ద్వారా పోర్ట్ సామర్థ్యం పెంపు, వాణిజ్యాభివృద్ధికి దోహదపడనున్నాయని చెప్పారు. కేంద్ర బడ్జెట్ కేటాయింపులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకుంటూ, రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా కృషి చేయనుందని పవన్ కళ్యాణ్ తెలియజేశారు.


Next Story