ప్రపంచ వేద విజ్ఞాన కేంద్రంగా శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం..

by Sumithra |
ప్రపంచ వేద విజ్ఞాన కేంద్రంగా శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం..
X

దిశ, డైనమిక్ బ్యూరో : వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ఇతర వైదిక అంశాలకు సంబంధించి ప్రపంచంలో ఎవరికి ఏ సందేహం కలిగినా, ఆధార సహితంగా నివృత్తి చేయగలిగే స్థాయికి వేద విశ్వవిద్యాలయం చేరుకోవాలని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. వేద విద్య, వేద విజ్ఞానం ఆధునిక సమాజానికి అత్యవసరమైన నేటి పరిస్థితుల్లో విశ్వవిద్యాలయం ప్రపంచ చిత్రపటం పై ప్రత్యేక స్థానం సాధించుకోవాలని చెప్పారు. శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం 18వ వార్షికోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ముందుగా సుదర్శన హోమం పూర్ణాహుతి కార్యక్రమంలో ఈవో ధర్మారెడ్డి పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమావేశంలో ఈవో మాట్లాడుతూ వేద విద్యను విశ్వవ్యాప్తం చేసి సమాజం ధర్మబద్ధంగా నడవాలనే ఉద్దేశంతో టీటీడీ వేద విశ్వవిద్యాలయం ప్రారంభించిందన్నారు.

సమాజంలోని రుగ్మతలను రూపుమాపి మంచి వైపు నడిపించే గురుతర బాధ్యతను వేద విద్యార్థులు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. కలియుగంలో వేద అభ్యాసకుల ద్వారా ధర్మాన్ని నిలబెట్టే ఆలోచనతోనే స్వామివారు వేద విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారని తాను భావిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు వేదాలను అభ్యసించడమే కాకుండా వేద విజ్ఞానాన్ని నూతన మార్గంలో ప్రపంచానికి అందించేలా కృషి చేయాలన్నారు. అలాగే తాళపత్ర గ్రంథాల్లోని విజ్ఞానాన్ని వెలుగులోకి తెచ్చి ప్రపంచానికి అందించేందుకు కృషి చేయాలని కర్తవ్య బోధ చేశారు. జన్మ, మృత్యు రహస్యాలు, మానవ శరీరాన్ని నడిపించే శక్తికి సంబంధించిన విజ్ఞానం పై ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకు సంబంధించి నిర్దిష్ట పరిశోధనలు చేసి ప్రపంచం శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం వైపు చూసేలా పని చేయాలన్నారు.

యోగ, క్రియ, ధ్యానం నేటి సమాజానికి ఎంతో అవసరమని ఆయన చెప్పారు. ప్రపంచం సంపాదించడం, కూడబెట్టుకోవడం అనే అంశాలపైనే ప్రయాణం చేస్తోందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో మానవులకు ఆరోగ్యం, శాంతి, ఉపశమనం కల్పించే కేంద్రంగా విశ్వవిద్యాలయం తయారు కావాలన్నారు. తాళపత్ర గ్రంథాలను అధ్యయనం చేసి, వాటిని పరిష్కరించి అవసరమైన వాటిని పుస్తక రూపంలో తెచ్చే ప్రక్రియ కొనసాగుతోందని ఈవో చెప్పారు. ఇది ప్రపంచంలోనే గొప్ప తాళపత్ర గ్రంథాలయంగా తయారు కావాలని ఆయన చెప్పారు. యూనివర్సిటీ ఆచార్యులు మరిన్ని పరిశోధన ప్రాజెక్టులు వచ్చేలా పని చేసి, రాబోయే రోజుల్లో యూనివర్సిటీ ఆర్థిక అవసరాలు మొత్తం కేంద్ర ప్రభుత్వం అందించేలా కృషి చేయాలని ఈవో ఏవీ ధర్మారెడ్డి స్పష్టం చేశారు.

యూట్యూబ్ ఛానల్ ఆవిష్కరణ..

వేద విజ్ఞానాన్ని ప్రపంచానికి తెలియజేయడం కోసం శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఏర్పాటుచేసిన "భారతీయ విజ్ఞాన ధార" యూట్యూబ్ ఛానల్ ను ఈ సందర్భంగా ఈవో ధర్మారెడ్డి జేఈవో సదా భార్గవితో కలసి ఆవిష్కరించారు. అలాగే విశ్వవిద్యాలయానికి సంబంధించిన సురభి న్యూస్ లెటర్, వర్సిటీ పరిశోధన , ప్రచురణల విభాగం రూపొందించిన హరివంశం రెండవ భాగం, బ్రహ్మసూత్ర భాష్యం మొదటి, రెండవ భాగం పుస్తకాలను ఆవిష్కరించారు.

Advertisement

Next Story

Most Viewed