Ap News: వైసీపీ శాశ్వతంగా డిస్మిస్

by srinivas |
Ap News: వైసీపీ శాశ్వతంగా డిస్మిస్
X
  • రాజకీయ ప్రజా సునామీలో కొట్టుకుపోతుంది
  • వైసీపీని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
  • వైసీపీలో ఎమ్మెల్యేలే అసంతృప్తితో రగిలిపోతున్నారు
  • - నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి వైసీపీ శాశ్వతంగా డిస్మిస్ అవుతుందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో రాజకీయ ప్రజా సునామీ రాబోతుందని ఆయన జోస్యం చెప్పారు. వైసీపీని సాగనంపేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని.. 2024 ఎన్నికల్లో తమ తీర్పు వెల్లడిస్తారన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో వైసీపీ ఓటమి స్పష్టమైన ప్రజా తీర్పు అని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని పదేపదే విన్నవించుకున్నా పట్టించుకోకపోవడంతో విసిగి వేసారి గట్టిగా నిలదీస్తే తనపై నిఘా పెట్టారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రస్తావిస్తే వాటిని పరిష్కరించేదిశగా అడుగులు వేయకుండా అవమానించేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలను భరించలేకే వైసీపీకి దూరమైనట్లు ఆయన తెలిపారు. ఈ విషయాన్ని బాహటంగా వెల్లడించినట్లు చెప్పారు. వైసీపీ నుంచి సస్పెండ్ చేసినా ఏం చేసినా వెనకడుగు వేసేది లేదని ప్రజా సమస్యలపై ప్రజా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు.

అయితే అధికార పార్టీకి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొందరు బాహటంగా వ్యాఖ్యలు చేస్తుంటే మరికొందరు లోపల ఉడికిపోతున్నారంటూ తనదైన స్టైల్‌లో పేర్కొన్నారు. వైసీపీలో ఇమడలేక వేరే పార్టీలో చేరేందుకు ఎమ్మెల్యేలు ఆలోచనలు చేస్తున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు.

Advertisement

Next Story