తిరుపతి జిల్లాలో తనయుల కోసం తండ్రుల త్యాగం

by sudharani |
తిరుపతి జిల్లాలో తనయుల కోసం తండ్రుల త్యాగం
X

దిశ, తిరుపతి: మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే ఆయా పార్టీల నేతలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రధానంగా అధికార పక్షమైన వైసీపీలో వారసుల రంగ ప్రవేశానికి లైన్ క్లియర్ చేసుకుంటున్నారు. పార్టీలో తమకున్న ఇమేజ్‌ని తమ వారసులు టికెట్ పొందేందుకు పావులు కదుపుతున్నారు. తిరుపతి జిల్లాలో ఈ విషయంలో ఆ ఇద్దరు నేతలు కొంత మేర సక్సెస్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. తిరుపతి జిల్లాలో ప్రధాన నేతలుగా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇకపై ప్రత్యక్ష రాజకీయాలకు టాటా చెప్పి.. వారి వారసులను రంగంలోకి దించేందుకు సిద్ధమయ్యారనే సమాచారం ఉంది.

కరుణాకర్ రెడ్డి తనయుడు బరిలోకి ?

చిత్తూరు జిల్లా నుంచి నూతనంగా ఏర్పడిన జిల్లా తిరుపతి. ఈ జిల్లాలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలకమైన నేతలు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన నాటి నుంచి తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంటే ఉంటూ పార్టీలో కీలకనేతలుగా మారారు. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ఆ ఇద్దరు చెబుతున్నారు. అందులో ఒకరు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. ఇదే విషయాన్ని పదే పదే పలు వేదికలపై ప్రజలతో పంచుకున్నారు.

దీంతో తిరుపతికి వైసీపీ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే నాయకుడు ఎవరంటూ ఆరా తీసే పని లేకుండా కరుణాకర్ రెడ్డి తనయుడు భూమన అభినయ్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఇప్పటికే తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా ఏకగ్రీవంగా గెలిచినా అభినయ్ రెడ్డి తిరుపతి డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆ బాధ్యతలతో తిరుపతి నగరంలో పలు అభివృద్ధి పనులను సైతం అన్ని తానై చూస్తున్నారు. రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్న భూమన అభినయ్ రెడ్డికి తిరుపతి ఎమ్మెల్యే టికెట్ దాదాపు ఖరారు చేసారంట పార్టీ అధినేత సీఎం జగన్ మోహన్ రెడ్డి.

మోహిత్ రెడ్డికీ లైన్ క్లియరేనా ?

ఇక చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఈసారి పోటీ చేసేది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాదని తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ నుంచి కీలక ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పోటికీ దిగుతున్నట్లు సీఎం జగన్ చెప్పారని విశ్వనీయ సమాచారం. ఇప్పటికే చంద్రగిరి నియోజకవర్గం నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

రానున్న ఎన్నికల్లో ఆయన బదులుగా మోహిత్ రెడ్డికి టికెట్ ఇచ్చే ప్రతిపాదనను ముఖ్యమంత్రి తెరమీదకు తెచ్చినట్లు పార్టీ నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. తిరుపతి రూరల్ ఎంపీపీగా గెలుపొందిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రస్తుతం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలోనూ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పార్టీలో కీలక పదవి ఇవ్వనున్నట్లు సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే వారసులు అసెంబ్లీలో అడుగు పెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

Next Story