లోకేశ్ యువగళం పాదయాత్ర పున:ప్రారంభం : రూట్ మ్యాప్‌లో కీలక మార్పులు... ఆ జిల్లాలలో డౌటే

by Seetharam |   ( Updated:2023-11-23 05:57:44.0  )
లోకేశ్ యువగళం పాదయాత్ర పున:ప్రారంభం : రూట్ మ్యాప్‌లో కీలక మార్పులు... ఆ జిల్లాలలో డౌటే
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దూకుడు పెంచనున్నారా? ఇక అనునిత్యం ప్రజల్లోనే ఉండాలని డిసైడ్ అయ్యారా? స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు కావడంతో ఇక స్పీడ్ పెంచాలని నిర్ణయించుకున్నారా? తండ్రి అరెస్ట్‌తో మధ్యలో నిలిపేసిన యువగళం పాదయాత్రను పున:ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ బెయిల్ మంజూరైన నేపథ్యంలో ఇకపై రెట్టింపు ఉత్సాహంతో లోకేశ్ యువగళం పాదయాత్రను మళ్లీ ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. పార్టీ వ్యవహారాలను ఈనెల 29 నుంచి చంద్రబాబు నాయుడు నేరుగా పర్యవేక్షించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈనెల 27 నుంచి లోకేశ్ యువగళం పాదయాత్రను పున: ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి క్యాడర్ సైతం ఏర్పాట్లు చేస్తున్నట్లు పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది.

ఇక దూకుడే

ఆంధ్రప్రదేశ్‌లో మరికొన్ని నెలల్లో సాధారణ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో ఇప్పటి నుంచే ఏపీలో రాజకీయం వేడెక్కింది. అన్ని రాజకీయ పార్టీలు అధికారమే పరమావధిగా వ్యూహాల్లో బిజీబిజీగా గడిపేస్తున్నాయి. ఇకపోతే అధికార వైసీపీని గద్దె దించాలని..వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ తమ లక్ష్యమంటూ టీడీపీ, జనసేన పార్టీలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇరు పార్టీల లక్ష్యం నెరవేరాలంటే ఖచ్చితంగా ప్రజల్లోనే ఉండాలని టీడీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలకు దగ్గరయ్యేందుకు టీడీపీ యువనేత నారా లోకేశ్ మళ్లీ యువగళం పాదయాత్రను ప్రారంభించబోతున్నారు. ఇందులో భాగంగా నారా లోకేశ్ యువగళం పాదయాత్ర పున:ప్రారంభానికి సిద్ధమవుతున్నారు. అందుకు ముహూర్తం సైతం ఖరారు అయినట్లు తెలుస్తోంది. నవంబర్ 27 నుండి లోకేష్ పాదయాత్ర పున:ప్రారంభమవుతున్నట్లు టీడీపీ నాయకులు చెప్తున్నారు. ఇందుకోసం పార్టీ క్యాడర్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టు కారణంగా సెప్టెంబరు 9న పాదయాత్రకు నారా లోకేశ్ బ్రేక్ ఇచ్చారు. ఎక్కడైతే పాదయాత్రకు బ్రేక్ పడిందో అక్కడే అంటే డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని పొదలాడ నుంచి ఈ యువగళం పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుంది. త్వరలోనే లోకేశ్ పాదయాత్రకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు సైతం వెలువడబోతున్నట్లు తెలుస్తోంది.

రెండున్నర నెలల విరామం అనంతరం

ఇకపోతే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ ఏడాది జనవరి 27న యువగళం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం అయిన కుప్పం నుంచి ఈ పాదయాత్ర ప్రారంభం అయ్యింది. రాయలసీమలో పాదయాత్ర కంప్లీట్ అయ్యింది. కోస్తాంధ్రలో అడుగు పెట్టింది. డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడలో కొనసాగుతుండగా బ్రేక్ వచ్చింది. చంద్రబాబు అరెస్ట్ తదనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో దాదాపు రెండున్నర నెలలపాటు యువగళం పాదయాత్రకు నారా లోకేశ్ విరామం పలికారు. ఇప్పటి వరకు నారా లోకేశ్ 208 రోజులపాటు..2,852 కిలోమీటర్లకు పైగా నడిచారు. అంతేకాదు 84 నియోజకవర్గాలను కవర్ చేస్తూ ఈ పాదయాత్ర కొనసాగింది.

చంద్రబాబు బాటలో

400 రోజుల్లో 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని లోకేశ్ భావించారు. ఈ పాదయాత్రను శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు చేయాలని భావించారు. అయితే రెండున్నర నెలలపాటు అంతరాయం ఏర్పడటంతో ఈ పాదయాత్ర విశాఖపట్నంలోనే ముగించాలని లోకేశ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సమయానికి ఎన్నికలు కూడా సమీపిస్తాయి కాబట్టి ఇతర కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండటంతో విశాఖతో ఫుల్ స్టాప్ పెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెల 27న ప్రారంభం కాబోతున్న ఈ మలివిడత యువగళం పాదయాత్ర రాజోలు,పి.గన్నవరం, అమలాపురం, ముమ్మిడివరం, కాకినాడ పట్టణ, కాకినాడ గ్రామీణ, పిఠాపురం, తుని నియోజకవర్గాల మీదుగా అనకాపల్లి జిల్లాలోకి ప్రవేశిస్తుందని తెలుస్తోంది. కొన్ని నియోజకవర్గాల మీదుగా విశాఖపట్నం చేరుకున్నాక అక్కడ పాదయాత్రను ముగించేందుకు టీడీపీ క్యాడర్ రూట్‌ మ్యాప్‌ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన వస్తున్నా మీకోసం’ పాదయాత్ర కూడా విశాఖపట్నంలోనే ముగిసింది. ఇప్పుడు నారా లోకేశ్‌ కూడా అక్కడే ముగిస్తే బెటర్‌ అని పార్టీ నేతలు సైతం సూచిస్తున్నట్లు తెలుస్తోంది.

More News: లక్ష్మీ పార్వతి మా కుటుంబంలోకి వచ్చిన శని మంచి ఆడది కాదు.. ఎన్టీఆర్ మనవడు సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story

Most Viewed