మహానాడును అడ్డుకునేందుకే.. మా కుటుంబాన్ని టార్గెట్ చేశారు : రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే

by Vinod kumar |
మహానాడును అడ్డుకునేందుకే.. మా కుటుంబాన్ని టార్గెట్ చేశారు : రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాజమండ్రిలో టీడీపీ మహానాడును అడ్డుకునేందుకే తమ కుటుంబాన్ని టార్గెట్ చేశారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఆరోపించారు. తమపై కక్షతోనే తన మామ ఆదిరెడ్డి అప్పారావు, భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్‌లను సీఐడీ అక్రమంగా అరెస్ట్ చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో చిట్ ఫండ్ సంస్థలో రెండ్రోజుల పాటు సీఐడీ తనిఖీలు చేసిందని.. తమపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారని అయినప్పటికీ భయపడలేదని పార్టీ కోసం నిలబడినట్లు వెల్లడించారు. కావాలనే ఇలాంటి దాడులు చేయిస్తున్నారని ఈ కేసులన్నీ న్యాయస్థానాల్లో నిలబడవని చెప్పుకొచ్చారు.

టీడీపీ సభ్యులను ఇబ్బందులు పెట్టాలనే వైసీపీ లక్ష్యంగా పెట్టుకుందని విమర్శించారు. టీడీపీ హయాంలో ఇలాంటి వేధింపులకు పాల్పడితే వైసీపీ వాళ్లు నిలబడేవారా అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ నిలదీవారు. ప్రశ్నించే గొంతును వైసీపీ ప్రభుత్వం నొక్కుతుందన్నారు. రాజమండ్రిలో ఆదిరెడ్డి కుటుంబానికి ఎలాంటి పేరు ఉందో అందరికీ తెలుసనని.. అక్రమ కేసులతో ప్రజల్లో తమపై ఉన్న నమ్మకాన్ని చెరపలేరన్నారు. ఏ సమయంలో వచ్చినా పేదలకు అండగా నిలబడే కుటుంబం తమది అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ తెలిపారు.

ఏదైనా తప్పు చేస్తే చట్టప్రకారం వెళ్లాలే కానీ, రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడటం సరికాదన్నారు. చిట్స్ ఫండ్ వ్యాపారం 35 ఏళ్లుగా నిర్వహిస్తున్నామని ఎన్నడూ లేని విధంగా వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగా కేసులు పెట్టి వేధించడం సరికాదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed