Raghurama Krishnam raju: అవినాశ్, భాస్కర్ రెడ్డి అరెస్టు ఖాయం

by srinivas |
Raghurama Krishnam raju: అవినాశ్, భాస్కర్ రెడ్డి అరెస్టు ఖాయం
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్టు అవ్వడం ఖాయమని నరసాపురం ఎంపీ, వైసీపీ అసమ్మతి నేత రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసు అధికారి చెప్పిన దాని ప్రకారం అరెస్టు తప్పనిసరి అని తెలుస్తోందన్నారు. వివేక హత్య కేసులో నిందితుడిగా అభియోగాలను ఎదుర్కొంటున్న సునీల్ యాదవ్ బెయిలు పిటిషన్‌పై సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్ ఆధారంగా ఎంపీ అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి అరెస్ట్ ఇక తప్పదని తెలిసిందన్నారు.

సోమవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామ కృష్ణంరాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వైఎస్ వివేకా హత్యకు ముందు, హత్య తర్వాత వైఎస్ భాస్కర్ రెడ్డి నివాసంలో నిందితులంతా సమావేశమైనట్టు గూగుల్ టేక్ అవుట్ ద్వారా స్పష్టమైన ఆధారాలు లభించినట్లు సీబీఐ తన కౌంటర్ పిటిషన్‌లో పేర్కొందని తెలిపారు. ఒకవేళ అవినాశ్, భాస్కర్ రెడ్డిను అరెస్టు చేయకపోతే, అదే న్యాయస్థానంలో సీబీఐ పెను సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇప్పటికే అప్రతిష్ట పాలైన సీబీఐ, మరింత అప్రతిష్ట పాలయ్యే ప్రమాదం ఉందని ఎంపీ రఘుురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. ఎంపీ అవినాశ్, భాస్కర్ రెడ్డి అరెస్టులకు నిరసనగా తిరగబడాలని వైసీపీ కార్యకర్తలు ప్రయత్నిస్తే వైఎస్ జగన్‌పై ఉన్న సీబీఐ కేసుల విచారణలో వేగం పుంజుకునే అవకాశం లేకపోలేదని ఎంపీ రఘురామ హెచ్చరించారు. వైఎస్ జగన్ చెప్పినట్లుగా అంతిమంగా ధర్మానిదే విజయని, నిర్దోషులుగా బయటకు రావాలని కోరుకోవడం మినహా, క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తలు చేయగలిగింది ఏమీ లేదని రఘురామ కృష్ణంరాజు చెప్పారు.

మరోవైపు ప్రభుత్వం నియమించిన సలహాదారులు ఇచ్చిన సలహాల వల్ల రాష్ట్రానికి ఒనగూరిన లాభం ఏమిటో చెప్పాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు. ప్రభుత్వ సలహాదారులు నాలుగు ఏళ్లుగా ఎన్ని సలహాలను ఇచ్చారని, అందులో ప్రభుత్వం ఎన్నింటిని అమలు చేసిందని, వాటి వల్ల రాష్ట్రానికి చేకూరిన ప్రయోజనాలు ఏమిటన్న దానిపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇకపోతే లాకప్ చిత్రహింసలపై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి హైకోర్టును ఆశ్రయించాలని రఘురామ కృష్ణంరాజు సూచించారు. గతంలో తనని కూడా ముసుగు ధరించిన వ్యక్తులే అరికాళ్ళపై 120 నుంచి 125 సార్లు కొట్టారని గుర్తు చేశారు. తనని చంపమని వైఎస్ జగన్ ఆదేశించినప్పటికీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ అనే దుర్మార్గుడైన అధికారి ఆయన పైకి హత్య కేసు వస్తుందన్న కారణంతో కాబోలు తనని విడిచి పెట్టాడని రఘురామ కృష్ణంరాజు చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed