Ahobilam : అహోబిలంలో ప్రారంభమైన పార్వేట ఉత్సవం

by Y. Venkata Narasimha Reddy |
Ahobilam : అహోబిలంలో ప్రారంభమైన పార్వేట ఉత్సవం
X

దిశ, వెబ్ డెస్క్ : అహోబిలం(Ahobilam) శ్రీ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం(Sri Lakshmi Narasimha Swamy Temple)లో పార్వేట ఉత్సవం(Parveta Festival) అత్యంత ఘనంగా ప్రారంభమైంది. 108 వైష్ణవ క్షేత్రాలలో 97వ క్షేత్రం ప్రసిద్ధమైన అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో దాదాపు 650 సంవత్సరాల నుంచి ఆనవాయితీగా పార్వేట ఉత్సవం నిర్వహిస్తున్నారు. ఉత్సవ ప్రారంభోత్సవానికి హాజరైన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, మాజీ మంత్రి భూమ అఖిల ప్రియ లక్ష్మీ నరసింహ స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

భారతదేశంలోనే ఏ క్షేత్రంలో లేని విదంగా ఈ అహోబిల క్షేత్రంలో పార్వేట ఉత్సవం ఆనవాయితీగా కొనసాగుతోంది. 41 రోజులపాటు 35గ్రామాలలో ఈ పార్వేట మహోత్సవం జరుగుతుంది. ఎక్కడలేని విధంగా స్వామివారే స్వయంగా 35 గ్రామాలకు వెళ్లి ఏటా ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు జరిగే తన కళ్యాణోత్సవానికి రమ్మని ప్రజలను ఆహ్వానించడమే పార్వేట ఉత్సవం. ప్రజలు తమ గ్రామానికి స్వామివారి పల్లకి రాగానే సంబరాలు చేసుకుంటారు. స్వామివారి పల్లకి గ్రామంలో ఉన్నంత సేపు గ్రామమంతా పండుగ వాతావరణ నెలకొంటుంది. పారువేట ఒక దేవ ఉత్సవం. 'పరి' అనగా గుర్రం , `వేట' అనగా దుష్ట శిక్షణ ,శిష్ట రక్షణ గురించి జరిగేదని...దీనికై స్వామివారు అహోబిలం చుట్టుపక్కల సంచరిస్తారని ప్రజల నమ్మకం.

అహోబిలం క్షేత్రంలో ప్రధాన దేవతలైన శ్రీ ప్రహ్లాదవరద స్వామి, జ్వాలా నరసింహ స్వామిని సుమారు 32 గ్రామాలకు ఊరేగింపుగా తీసుకువెళ్లారు. పారువేట ఉత్సవం మకరసంక్రాంతి నాడు ప్రారంభమవుతుంది. ఈ క్షేత్రంలో కొండపై ఉగ్ర నరసింహునిగా కొండ దిగువున శాంతమూర్తిగా, మొత్తం క్షేత్రం అంతా తొమ్మిది రూపాయలతో నారసింహుడు కొలువై ఉన్నారు.

"హరినామమే కడు ఆనందకరము" అని నిత్యం తనని పూజించే భక్తుడు ప్రహ్లాదుని రక్షించడానికి శ్రీ మహా విష్ణువు నరసింహునిగా అహోబిలంలో అవతరించాడు. అహోబిలం కర్నూలు జిల్లాలో ఉంది. స్వామి వారి రూపాన్ని చూసిన దేవదానవులు. అహో బలం.... అహో బలం అని ఆశ్చర్యపోయారు. ఇదే కాలక్రమేనా 'అహోబిలం' అనే పేరుతో స్థిరపడింది. ఇక్కడ కొలువైన నరసింహస్వామి వారి దేవేరి చెంచులక్ష్మి. ప్రతి సంవత్సరం ఫల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు నరసింహుని కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతుంది. స్వయంగా బ్రహ్మదేవుడు స్వామి వారి కల్యాణోత్సవం జరిపిస్తాడని...సకల దేవతలు స్వామివారి కల్యాణానికి హాజరవుతారని ప్రతీతి.

Next Story