ఏపీలో సాగు నీటి సంఘాల ఎన్నికలకు ఉత్తర్వులు

by Y. Venkata Narasimha Reddy |
ఏపీలో సాగు నీటి సంఘాల ఎన్నికలకు ఉత్తర్వులు
X

దిశ, వెబ్ డెస్క్ : సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భారీ, మధ్య చిన్న నీటి పారుదల శాఖల ప్రాజెక్టుల వారీగా సాగునీటి సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ మొదటి వారం నాటికి సాగు నీటి సంఘాల ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాగునీటి సంఘాల ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ఆథారిటీ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్టుల పరిధి ఆధారంగా ఓటర్ల జాబితాను సవరించాలని అధికారులకు సూచించింది. ఆయకట్టు, డిస్ట్రిబ్యూటరీలు, ప్రాజెక్టుల పరిధిలో కొత్తగా వచ్చిన ప్రాంతాలను కలిపి ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించింది. సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వాహణపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విజయవాడలో మాట్లాడుతూ నవంబర్ మొదటి వారం నాటికి సాగు నీటి సంఘాల ఎన్నికలు పూర్తి చేస్తామన్నారు. నేడు రైతుల ప్రాతినిధ్యంతో ఇరిగేషన్ శాఖ పనిచేస్తోందని పేర్కొన్నారు. ప్రతి చివరి ఎకరం వరకు సాగు నీరు అందేలా సాగు నీటి సంఘాల ప్రాతినిధ్యంతో ఇరిగేషన్ శాఖ ప్రణాళికాబద్ధంగా పని చేస్తుందని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు సాగునీటి వ్యవస్థకు పునరుజ్జీవం తీసుకురావాలని నిర్ణయించారని, నిర్వీర్యమైన సాగు నీటి వ్యవస్థను.. సాగునీటి సంఘాల ద్వారా రైతుల ప్రాతినిధ్యంతో తిరిగి గాడిలో పెడతామన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఇరిగేషన్ వ్యవస్థలో పూడిక, మరమ్మత్తులు, గేట్లు, గట్ల వంటి వాటికి నిర్వహాణ లేదు, పర్యవేక్షణ లేదని విమర్శించారు. వైసీపీ పాలనలో రైతాంగం అన్ని రంగాల్లో నిర్లక్ష్యానికి గురైందన్నారు.

Advertisement

Next Story